రెబల్ స్టార్ అన్న మాటను రియల్ గా చూపించాడు

Update: 2016-06-22 04:20 GMT
కర్ణాటక మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 14 మంది మంత్రులపై టోకుగా వేటు వేయటం తెలిసిందే. కన్నడ రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని రేపిన ఈ ఉదంతంలో.. రెబల్ స్టార్ గా సుపరిచితుడైన అంబరీశ్ ను సైతం పదవి నుంచి తప్పించటం తెలిసిందే. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని.. మనస్తాపానికి గురైనట్లుగా కనిపిస్తోంది. తనను మంత్రి పదవి నుంచి తొలగించటాన్ని ఆయన తీవ్ర అవమానకరంగా భావించటమే కాదు.. ఈ తీరును ఆయన తీవ్రంగా తప్పు పడుతున్నారు.

రెబల్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఆయన.. తనలోని రెబల్ కోణాన్ని ప్రదర్శించారు. తనను పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఒంటికాలి మీద ఎగిరి పడిన ఆయన.. సీఎం మీద తీవ్ర వ్యాఖ్యలేచేశారు. తనను పదవి నుంచి తప్పిస్తున్నట్లు ముందే సమాచారం ఇచ్చినా.. తానే మంత్రి పదవికి రాజీనామా ఇచ్చేవాడినని వాపోతున్న ఆయన.. తనను తీవ్రంగా అవమానించారని వాపోయిన తీరు ఆయన్ను అభిమానించే వారిని కలిచివేస్తోంది. తన ఆత్మగౌరవానికి భంగం కలిగించే విషయంలో ఉన్న వారు ఎవరైనా.. ఏ స్థానంలో ఉన్నా ఆ విషయాన్ని తాను అసలు పట్టించుకోనని స్పష్టం చేసిన అంబరీశ్.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎంపై అంబరీశ్ పేల్చిన మాటల తూటాలు చూస్తే..

= తనకు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకోవటానికి ఆయన (సీఎం సిద్ధరామయ్య) హిట్లరో.. డిక్టేటరో కాదు. సినీ పరిశ్రమలో 40 ఏళ్లకు పైనే పని చేశా.

= మూడుసార్లు ఎంపీగా పని చేశా. కేంద్రమంత్రిగా పని చేశా. నేనెప్పుడూ పదవుల కోసం లాబీయింగ్ జరపలేదు. ఇలాంటి పరిస్థితి నాకెప్పుడూ ఎదురు కాలేదు.

= ఆయనకు ఇష్టం వచ్చినట్లుగా మార్చేయటానికి నేనేమీ ఆయన కాలికి వేసుకునే చెప్పును కాను.

= మంత్రి పదవికి అసమర్థుడినైతే.. ఎమ్మెల్యేగా కూడా అనర్హుడినే. ఆ పదవి నుంచి తొలగించినప్పుడు ఎమ్మెల్యేగా కూడా సరిపోను. అందుకే.. ఆ పదవికి రాజీనామా చేశా.
Tags:    

Similar News