ఇంకా ఎన్నేళ్లీ మాటలు అంబ‌టి?

Update: 2022-09-03 07:53 GMT
ఏ ప్ర‌భుత్వ‌మైనా అధికారంలోకి వ‌చ్చాక ఇంకా గ‌త ప్ర‌భుత్వంపైన నింద‌లు వేయ‌డం అంత‌గా క‌రెక్టు అనిపించుకోదు. అందులోనూ అధికారంలోకి వ‌చ్చి ఏళ్లు గ‌డిచిపోతున్నా.. గ‌త ప్ర‌భుత్వం వ‌ల్లే ఫ‌లానా ప‌ని ఇలా అయ్యింద‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దమ‌వుతుంద‌ని అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం వ‌రుస‌గా గ‌త ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉంది. ఏదైనా ప్రాజెక్టు విఫ‌ల‌మైతే గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వ త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్లే ఇలా అయింద‌ని కేంద్రంలోని బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అందులోనూ దేశ మొద‌టి ప్ర‌ధాని నెహ్రూ కాలం నుంచి త‌వ్వుతున్నారు.

ఇప్పుడు ఇదే ప‌రిస్థితి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఏదైనా రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టు వ‌చ్చినా, ప‌రిశ్ర‌మ వ‌చ్చినా అది త‌మ ఘ‌న‌తేన‌ని, సీఎం జ‌గ‌న్ దూర‌దృష్టి వ‌ల్లేన‌ని వైఎస్సార్సీపీ నేత‌లు చెప్పుకుంటున్నారు. అదే ఏదైనా విఫ‌ల‌మ‌యితే అది గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీసుకున్న త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్లే అంటున్నార‌ని చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక మూడేళ్లు దాటిపోయింది.. మూడున్న‌రేళ్లు కావ‌స్తోంది. ఇంకా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ఆడిపోసుకోవ‌డం బాగోలేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు పోల‌వరం ప్రాజెక్టును డిసెంబ‌ర్ 2021క‌ల్లా పూర్తి చేస్తామ‌ని గ‌త జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ అసెంబ్లీ సాక్షిగానే తొడ‌లు గొట్టి.. మీసాలు మెలేసి చెప్పార‌ని గుర్తు చేస్తున్నారు. అయితే అప్ప‌టికి పోలవ‌రం పూర్తి కాలేదు. దాన్ని 2022 మార్చి నాటిక‌ని పొడిగించారు. ఈలోపు అనిల్ కుమార్ మంత్రి ప‌ద‌వి పోయి.. ఆయ‌న స్థానంలో అంబ‌టి రాంబాబు వ‌చ్చారు.

పోల‌వ‌రం పూర్తిచేసే ఓట్లు అడుగుతామ‌ని బ‌ల్ల‌గుద్ది చెప్పిన వైఎస్సార్సీపీ నేత‌లు, మంత్రి అంబ‌టి రాంబాబు ఇప్పుడు పోల‌వరం ఎప్ప‌టికి పూర్త‌వుతుందో చెప్ప‌లేమ‌ని అంటున్నారు. అదేమంటే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌ప్పిదాల వ‌ల్ల పోల‌వ‌రం పూర్తి కావ‌డం లేద‌ని చెబుతున్నారు. మ‌రీ ఇదే విష‌యాన్ని ముందే చెబితే స‌రిపోతుంది క‌దా అని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. పోల‌వ‌రం పూర్తి చేస్తామ‌ని డెడ్‌లైన్ల‌తో స‌హా చెప్పి ఇప్పుడు పీచేముఢ్ అంటే ఎలా అని మంత్రి అంబ‌టి రాంబాబు నిల‌దీస్తున్నారు. చంద్ర‌బాబు వ‌ల్ల కాలేద‌నేగా మీకు అధికారం అప్ప‌గించింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌ళ్లీ తాజాగా ప్ర‌కాశం జిల్లాలో గుండ్ల‌క‌మ్మ ప్రాజెక్టు గేటు పాడై కొన్ని వంద‌ల క్యూసెక్కులు నీరు వృథాగా పోయాయి. దీనిపైన కూడా అంబ‌టి రాంబాబు య‌థాలాపంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపైకి విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలోనే గుండ్ల‌క‌మ్మ గేట్లు పాడ‌య్యాయ‌ని.. ఇంక రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు గేట్లు పాడ‌య్యాయ‌ని చెబుతున్నారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏవీ పాడ‌వ‌లేద‌ని అంటున్నారు.

స‌రే అంబ‌టి రాంబాబు చెప్పిన‌ట్టే చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలోనే గుండ్ల‌క‌మ్మ ప్రాజెక్టు గేట్లు పాడ‌య్యాయ‌ని అనుకుంటే మ‌రి ఈ మూడేళ్ల‌కు పైగా అధికారంలో ఉంటూ వ‌స్తున్న వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం ఏమి చేస్తున్న‌ట్టు అని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చి మొన్నో, నిన్నో కాలేద‌ని మూడేళ్లు దాటిపోయింద‌ని.. మ‌రి ఇన్నేళ్ల‌పాటు ప్రాజెక్టుల గేట్లు పాడ‌యితే వైఎస్ఆర్సీపీ ప్ర‌భుత్వం ఏం చేస్తున్న‌ట్టు అని అంబ‌టి రాంబాబుకు గ‌ట్టిగానే కౌంట‌ర్లు ప‌డుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News