ముద్రగడ కొడుకును పోలీసులు కొట్టారా?

Update: 2016-06-10 11:33 GMT
ముద్రగడ పద్మనాభం కుటుంబం చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నిస్తున్న పోలీసులు ముద్రగడ కుమారుడిని కొట్టారని.. ముద్రగడ భార్యతోనూ దురుసుగా ప్రవర్తించారని వైసీపీ నేత అంబటి రాంబరాబు ఆరోపిస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని, వాగ్దానాన్ని నిలుపుకోమని మాత్రమే కాపు నాయకులు డిమాండ్ చేస్తున్నారని అన్న ఆయన పోలీసులపై , ప్రభుత్వంపై ఆరోపనలు చేశారు.  ఇచ్చిన హామీలు నిలుపుకోకుండా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ముద్రగడ కుమారుడిని పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లారని, ముద్రగడ సతీమణి పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలను కూడా ఆయన మీడియాకు చూపించారు.

అదేసమయంలో ఆయన సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపైనా మండిపడ్డారు. అధికార దుర్వినియోగంతో ఎంఎస్ ఓలను బెదిరించి సాక్షి - ఇతర చానళ్ల ప్రసారాలు నిలిపివేయించారని ఆరోపించారు. ఎంఎస్ ఓలకు జిల్లాల్లోని ఎస్పీలు ఫోన్లు చేసి బెదిరించారని ఆరోపించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తుని ఘటన జరిగినప్పుడు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు శాంతికాముకులని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అరెస్టులు ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమ నుంచి వచ్చినవారే తునిలో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఆరోజు చంద్రబాబు - టీడీపీ మంత్రులు ఆరోపిస్తూ వైఎస్ జగన్ పై నెట్టివేసే ప్రయత్నం చేశారని గుర్తు చేస్తూ... అప్పుడు రాయలసీమవారు విధ్వంసానికి పాల్పడ్డారని చెప్పి ఇప్పుడు గోదావరి జిల్లాల అమాయక ప్రజలను ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ నిలదీశారు.  చంద్ర‌బాబు తాను ఇచ్చిన హామీల్లో ఏవీ నెర‌వేర్చ‌లేద‌ని అంబటి రాంబాబు ఆరోపించారు. కాపుల‌ను బీసీల్లో చేరిస్తే తాను చంద్ర‌బాబు కాళ్లు క‌డిగి ఆ నీళ్లు నెత్తిన చ‌ల్లుకుంటానని అన్నారు. ప్ర‌భుత్వ అక్ర‌మాల‌ను చూపెట్టే ఛాన‌ళ్ల‌ను క‌ట్ చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ‘ప్ర‌జాస్వామ్యంలో మీడియా గొంతు నొక్కారు’ అని  అంబటి ఆరోపించారు.

అయితే.. ముద్రగడ పట్ల వ్యవహరించిన తీరుపై మాట్లాడడం మొదలుపెట్టిన అంబటి ఆ విషయంలో ఎలాంటి డిమాండ్లు చేయకుండా సాక్షి టీవీ ప్రసారాల నిలిపేవతను ప్రధానాంశంగా చేర్చుకుని మాటలు కొనసాగించడంతో ఆయన ముద్రగడపై ప్రేమ చూపుతున్నారా.. లేదంటే సాక్షిపై ప్రేమతో చంద్రబాబుపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
Tags:    

Similar News