శంకుస్థాప‌న‌లో త‌మ్ముళ్ల క‌మీష‌న్ ఎంత‌?

Update: 2015-10-26 08:06 GMT
అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించిన అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబు చాలానే విష‌యాలు చెబుతున్నారు. శంకుస్థాప‌న కోసం ఏపీ స‌ర్కారు భారీగా ఖ‌ర్చు చేసింద‌ని చెబుతున్న అంబ‌టి..దీనికి సంబంధించిన లెక్క ఒక‌టి చెప్పుకొచ్చారు.

అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు ప‌ది నుంచి ప‌దిహేను కోట్ల‌కు మించి ఖ‌ర్చు చేయ‌లేద‌ని చెబుతున్న ఏపీ స‌ర్కారు మాట‌ల‌కు భిన్నంగా అంబ‌టి లెక్క‌లున్నాయి. ఆయ‌న లెక్క ప్ర‌కారం అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం కోసం రూ.400కోట్ల‌కు పైనే ఏపీ స‌ర్కారు ఖ‌ర్చు చేసింద‌ని చెప్పుకొచ్చారు.

అమ‌రావ‌తికి వ‌చ్చిన వీవీఐపీలు మొద‌లు.. మిగిలిన వారి ప్ర‌యాణ ఖ‌ర్చుల కోసం రూ.199కోట్లు.. అతిధులు బ‌స చేసేందుకు రూ.78కోట్లు.. స‌భ నిర్వ‌హ‌ణ‌కు రూ.8కోట్లు.. సాంస్కృతిక కార్య‌క్ర‌మాల కోసం రూ.10కోట్లు.. ప్ర‌చారానికి రూ.30కోట్లు.. పోలీసు శాఖ‌కు రూ.10కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు చెప్పుకొచ్చారు. మొత్తం ఖ‌ర్చు రూ.400కోట్ల మార్క్ ను దాటింద‌న్న ఆయ‌న‌.. అందులో 50 శాతం త‌మ్ముళ్ల క‌మిష‌న్ కింద వారి జేబుల్లోకి వెళ్లింద‌ని ఆరోపించారు.

అంబ‌టి ఆరోప‌ణ‌లు చూస్తుంటే.. అమ‌రావ‌తి శంకుస్థాప కార్య‌క్ర‌మం కోసం పెట్టిన ఖ‌ర్చులో దాదాపు రూ.200కోట్లు క‌మిష‌న్ల రూపంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు అండ్ కో జేబుల్లోకి వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. దీనికి సంబంధించి త‌మ్ముళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News