వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా జంపింగ్‌ల పర్వానికి శ్రీకారం చుట్టిన సీనియర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రతిష్టను తేల్చేసే విధంగా వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత బాధిత రైతులతో సమావేశం అయ్యేందుకు వెళ్లిన సందర్భంగా ఏపీ విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ర్యాలీలో భూమా కూతురు, ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనం చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖిలప్రియపై దాడులకు పాల్పడ్డారని టీడీపీ వర్గాలు అంటుండగా అలాంటిదేమీ లేదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో ఎనిమిది మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేకెత్తించింది.
వైసీపీ నేతలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అఖిలప్రియపై జరగని దాడిని జరిగినట్లుగా చెప్పడం ద్వారా టీడీపీ నేతలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. జగన్ పర్యటన సందర్భంగా తాను అక్కడే ఉన్నానని పేర్కొంటూ అఖిలప్రియపై వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించలేదని అంబటి స్పష్టం చేశారు. కీలకమైన రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకే ఇలా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. దాడిచేయడం వైసీపీ రాజకీయాల్లో లేనేలేదని అన్నారు. దాడికి పాల్పడ్డారంటూ ఒక్క రోజులోనే తమ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు, ఏపీ ప్రభుత్వం గతంలో జరిగిన అనేక ఉదంతాలపై ఇంతే వేగంగా ఎందుకు స్పందించలేదని అంబటి ప్రశ్నించారు. మహిళా ఎమ్మార్వోపై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఫ్యాన్సీ నెంబర్ కోసం దౌర్జన్యానికి పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరులు, టూరిజం సిబ్బందిపై దాడి చేసినా ఎమ్మెల్సీ సతీశ్ పై కేసు ఎందుకు పెట్టలేదని అంబటి ప్రశ్నించారు.
వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని అంబటి ఎద్దేవా చేశారు. తమ ఇలాకా అయిన నంద్యాలకు రావాలని జగన్‌కు భూమా సవాల్ విసరడాన్ని ప్రస్తావిస్తూ...జగన్ తప్పకుండా వస్తారని అంబటి తెలిపారు. ఎదుటి వారి దమ్ము - ధైర్యం మాట్లాడే భూమా నాగిరెడ్డి తన గురించి కాస్త ఆలోచించుకోవాలని అంబటి సూచించారు. వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరినందుకు తను సహా కూతురుతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి దమ్మును చాటుకోవాలని భూమా నాగిరెడ్డికి అంబటి సూచించారు. ఈ చాలెంజ్‌కు భూమా సిద్ధమా అని అంబటి ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/