వీర విధేయ రాంబాబు.. పైనుంచి వచ్చిన మాటపై ఓపెన్ అయిపోయారు

Update: 2022-05-09 06:30 GMT
నిత్యం నీతులు వల్లించే వైసీపీ నేతల తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలియజేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. విలువల గురించి.. వీరత్వం గురించి అదే పనిగా మాట్లాడే ఏపీ అధికారపక్ష నేతలు మనసులో ఉన్నది ఒకటి పైకి మాట్లాడేది ఒకటన్నట్లుగా ఉండటం వారికి అలవాటే అన్న ఆరోపణలు తరచూ వినిపిస్తూ ఉంటాయి.

తాజాగా మంత్రి అంబటి రాంబాబు నోటి నుంచి వచ్చిన మాటల్ని వింటే.. వీర విధేయ రాంబాబు టైటిల్ కు ఏ మాత్రం తగ్గరని చెప్పాలి. ఆదివారం వేళ ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. తన మనసులోని మాటను చెప్పేశారు.

మీడియా సమావేశానికి ఎవరెవరు వచ్చారు? అని ప్రశ్నించిన ఆయన.. ఈనాడు.. ఆంధ్రజ్యోతి తదితర మీడియా ప్రతినిధులు రాలేదా? అని మిగిలిన విలేకరుల్ని ప్రశ్నించారు. సమాచారం లేకపోవటం వల్ల వారు హాజరు కాలేదని మిగిలిన వారు చెప్పారు. మరేం లేదు.. వాళ్లు కాని వస్తే.. తిట్టి పంపిద్దామని అనుకున్నానంటూ ఓపెన్ అయ్యారు. ఇదంతా తన సొంత తెలివి కాకుండా.. పై నుంచి వచ్చిన ఆదేశాలకు తగ్గట్లుగా తాను వ్యవహరిస్తున్నట్లుగా  అసలు విషయాన్ని చెప్పేశారు.

ఈటీవీ.. ఈనాడు.. ఆంధ్రజ్యోతి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. టీవీ5 విలేకర్లు వచ్చారా? వారొస్తే తిట్టి పంపాలని పై నుంచి చెప్పినట్లుగా అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రెస్ మీట్ పేరుతో మీడియా భేటీ నిర్వహించిన అంబటి.. తన చాంబర్ లో తన పని తీరు ఎలా ఉందో చెప్పాలంటూ ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కోరారు. తమ వ్యతిరేక మీడియాలో వచ్చే కథనాలపై విచారణ చేయిస్తాం కానీ.. ఆ విషయాన్ని తాను బయటకు చెప్పలేనని చెప్పటం గమనార్హం.

తమకు పై నుంచి మాత్రం తమ వ్యతిరేక మీడియాకు సంబంధించిన ప్రతినిధులు వస్తే మాత్రం తిట్టి పోయాలని చెప్పారని.. వాళ్లు వచ్చి ఉంటే తిట్టి పంపించేవాడినని పేర్కొన్న రాంబాబు మాటల్ని వింటే.. ఇంతకు మించిన వీర విధేయుడు మరెక్కడా ఉండరన్న భావన కలుగక మానదు. అంటే.. వైసీపీ నేతలంతా పై నుంచి వచ్చే ఆదేశాల్ని ఫాలో కావటం తప్పించి.. తమదైన వెన్నుముక ఉండదన్న మాట?
Tags:    

Similar News