అమిత్ షా ప‌వ‌న్‌...అంబ‌టి కొత్త డౌట్లు

Update: 2019-11-15 09:52 GMT
జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌ఠాత్తుగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. గ‌త కొద్దికాలంగా ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుప‌డుతున్న ప‌వ‌న్‌...తాజాగా హ‌స్తిన‌కు వెళ్ల‌డం...ఆయ‌న  ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలను క‌ల‌వ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అవసరమైతే కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తాన‌ని ఇటీవలే ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌...త‌క్కువ స‌మ‌యంలోనే...ఈ టూర్ పెట్టుకోవ‌డం స‌హ‌జంగానే రాజ‌కీయ‌వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరిలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని జనసేనాని ప్రారంభించి అనంత‌రం ఢిల్లీ బ‌య‌ల్దేరి వెళ్లారు.

గ‌త కొద్దికాలంగా, భవన నిర్మాణ కార్మికుల గురించి ప‌వ‌న్ గ‌లం విప్పుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ఆయ‌న లాంగ్ మార్చ్ సైతం నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో కూలీల ఆత్మహత్యలను కేంద్రం దృష్టికి ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. మ‌రోవైపు మాతృభాష కంటే ఆంగ్ల మాధ్య‌మానికి జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తుండ‌టాన్ని సైతం...బీజేపీ పెద్ద‌లు అభ్యంత‌రం చెప్తున్నారు. ఈ విష‌యంలోనూ...బీజేపీ ముఖ్యుల‌తో ప‌వ‌న్ చ‌ర్చించే అవ‌కాశం ఉందంటున్నారు.

ఇక వీట‌న్నింటికంటే...గ‌త కొద్దికాలంగా వైసీపీకి బీజేపీకి స‌న్నిహిత సంబంధాలు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుండ‌టం...అదే స‌మ‌యంలో బీజేపీ సైతం రాష్ట్రంలో బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌టం...ప‌వ‌న్ సైతం మునుప‌టి అంత వ్య‌తిరేక‌త‌ను కాషాయ పార్టీపై క‌నిపించ‌నివ్వ‌ని నేప‌థ్యంలో...ఈ టూర్ పొత్తుల ఎత్తుగ‌డ‌కు వేదిక‌గా నిలుస్తుందంటున్నారు. ఇదిలాఉండ‌గా, ప‌వ‌న్ ఢిల్లీ టూర్‌పై వైసీపీ స్పందించింది. పవన్ కల్యాణ్‌ను ఢిల్లీకి చంద్రబాబు తన దూతగా పంపించి ఉంటాడనేది త‌న అనుమానమ‌ని వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. ప‌వ‌న్‌ మాత్రం రాష్ర్ట ప్రయోజనాల కోసం వెళ్లాడని తాను భావించడం లేదన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చాక పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లాడో చెప్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Tags:    

Similar News