బ్రేకింగ్: క్రికెట్ కు అంబటిరాయుడు గుడ్ బై

Update: 2019-07-03 08:14 GMT
భారత క్రికెటర్.. తెలుగు తేజం అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విశేషంగా రాణించినా చివరి నిమిషంలో తనను ప్రపంచకప్ నకు ఎంపిక చేయనందుకు అంబటి రాయుడు ట్వీట్ చేసి ఎండగట్టిన సంగతి తెలిసిందే.  తన బదులు తీసుకున్న విజయ్ శంకర్ తేలిపోవడం.. పైగా అతడు గాయంతో దూరమైన తనను ఎంపిక చేయకుండా తాజాగా మయాంక్ అగర్వాల్ ను ప్రపంచకప్ నకు ఎంపిక చేశారు. దీనిపై అంబటిరాయుడు మనస్థాపం చెందారు.

ఎంతో రాణించినా బీసీసీఐ పట్టించుకోకపోవడం.. తాను ట్వీట్ చేసినందుకు తాజాగా కూడా ఎంపిక చేయకపోవడంతో మనస్తాపం చెందిన అంబటిరాయుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్టు బుధవారం ప్రకటించాడు. 

తాజాగా అంబటి రాయుడు తనను ప్రపంచకప్ నకు ఎంపిక చేయకపోవడానికి నిరసనగా బీసీసీఐకు ఈమెయిల్ పంపాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్టు అందులో పేర్కొన్నాడు.

ప్రపంచకప్ జట్టులో అంబటిరాయుడుకు చోటు ఖాయం అని అనుకున్నారంతా.. కానీ చివరి నిమిషంలో రాయుడుకు బదులు విజయ్ శంకర్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.దీనిపై చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ త్రి డైమన్షన్ లో విజయ్ శంకర్ బ్యాటింగ్ - బౌలింగ్ - ఫీల్డింగ్ బాగా చేయగలడని అందుకే అతడినే ఎంపిక చేశామని చెప్పుకొచ్చాడు. దీనిపై రగిలిపోయిన అంబటిరాయుడు అప్పుడే తాను విజయ్ శంకర్ త్రి డైమన్షన్ చూడడానికి త్రీడి కళ్లద్దాలు కొంటానని సెటైరికల్  ట్వీట్ చేయడం దుమారం రేపింది.

ఆ తర్వాత ప్రపంచకప్  ప్రాబబుల్స్ లో ఎంపిక చేయకుండా ఎవరైనా గాయపడితే ఎంపిక చేయడానికి వీలుగా రిషబ్ పంత్ - రాయుడులను రిజర్వ్ గా  బీసీసీఐ ప్రకటించింది. అయితే ధావన్ స్థానంలో పంత్ ను తీసుకున్న బీసీసీఐ - ఇప్పుడు విజయ్ శంకర్ గాయపడ్డా ఆ స్థానంలో రాయుడును తీసుకోలేదు. ఇతడి ప్లేసులో మయాంక్ అగర్వాల్ ను తీసుకుంది. దీంతో అసంతృప్తికి గురైన రాయుడు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు.


Tags:    

Similar News