భార‌తీయుల‌కు అమెరికా శుభ‌వార్త‌

Update: 2022-08-26 00:30 GMT
అమెరికాలో చదువుకోవాలనుకునే భారతీయ‌ విద్యార్థులకు అమెరికా గుడ్ న్యూస్ వినిపించింది. విద్యార్థి వీసా (ఎఫ్‌-1) దరఖాస్తు ఒకసారి తిరస్కరణకు గురైనా... అదే విద్యా సంవత్సరంలో మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం క‌ల్పిస్తూ ఆ దేశం నిర్ణ‌యం తీసుకుంది. అమెరికాలో విద్యా సంవత్సరం ఇటీవల మొద‌లైంది. దీంతో ఎఫ్‌-1 వీసాలకు కాస్త ఒత్తిడి త‌గ్గింది. దీంతో వీసా తిరస్క‌ర‌ణ‌కి గురైన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది.

కోవిడ్ విజృంభ‌ణ‌తో గ‌త రెండేళ్లు త‌క్కువ సంఖ్య‌లోనే అమెరికా.. భారతీయ‌ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసింది. మ‌రోవైపు కోవిడ్‌ విజృంభణతో అమెరికా విద్యా సంస్థల్లో చేరిన భార‌తీయ‌ విద్యార్థుల సంఖ్యా తగ్గింది.

ఇప్పుడు పరిస్థితులు కుదుట‌ప‌డటంతో అమెరికా వెళ్లేందుకు ఆసక్తి చూపే భార‌తీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో తొలిసారి విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా నిర్ణ‌యం తీసుకుంది.

ఒకసారి విద్యార్థి వీసా తిరస్క‌ర‌ణ‌కు గుర‌యితే మ‌ళ్లీ ఆ ఏడాదిలో దరఖాస్తు చేసుకునే విషయంలో అప్ప‌ట్లో పరిమితులు విధించింది. అర్హుల అవ‌కాశాల‌కు ఇబ్బందులు రాకూడ‌ద‌నే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ నిబంధ‌నలో అమెరికా సడ‌లింపులు చేసింది. కోవిడ్ ముందు వరకు దేశవ్యాప్తంగా ఏటా 50 నుంచి 60 వేల వరకు ఎఫ్‌-1 వీసాలను భారతీయ విద్యార్థులకు జారీ చేసేవారు. ఒక దశలో ఆ సంఖ్య 62 వేలు సైతం దాటినట్లు అమెరికా రాయబార కార్యాలయం ఇటీవ‌ల తెలిపింది.

కాగా మ‌రోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరం 2023కి సంబంధించి పరిమితి మేర 65,000 హెచ్‌-1బీ వీసాల జారీకి సరిపడా దరఖాస్తులు అందినట్లు అమెరికా తెలిపింది. ఏటా గరిష్ఠంగా 65 వేల హెచ్‌-1బీ వీసాలు,అమెరికా మాస్టర్స్‌ డిగ్రీ మినహాయింపు విభాగం కింద మరో 20 వేల వీసాలను మంజూరు చేసేందుకు అమెరికా అనుమ‌తిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఈ రెండు విభాగాలకు తగినన్ని దరఖాస్తులు ఇప్పటికే అందినట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఈ వీసాలను నాన్‌-ఇమిగ్రెంట్‌ వర్క్‌ వీసాలుగా పరిగణిస్తారు. వీటి ద్వారా విదేశీ వృత్తి నిపుణులను ఉద్యోగులుగా నియమించుకునేందుకు అమెరికా సంస్థలకు అవకాశం ల‌భిస్తుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇతర వృత్తి నిపుణులు మ‌న‌దేశం నుంచి హెచ్‌-1బీ వీసాల‌తోనే అమెరికాకు వెళ్తారు.
Tags:    

Similar News