ట్రంప్ కు మీడియా వార్నింగ్ ఇచ్చిందా?

Update: 2017-01-19 06:31 GMT
ఏది ఏమైనా అమెరికా అమెరికానే. ఆ దేశంలో వ్యవహారాలు కాస్త భిన్నంగానే ఉంటాయి. స్వేచ్ఛగా మాట్లాడటం అక్కడ ఎక్కువే. మీడియా కూడా ఒక అడుగు ముందుకు వేస్తూ.. కాస్తంత దూకుడుగానే వ్యవహరిస్తూ ఉంటుంది. మనకు మాదిరి పరిస్థితులకు అనుగుణంగా ఆచితూచి వ్యవహరించే ధోరణి ఇంకా మొదలు కాలేదనే చెప్పాలి.

పవర్ లోకి వచ్చిన వారు.. మీడియా విషయంలో అనుసరించే విధానాలు మారిస్తే.. గట్టిగా నిలదీసే పరిస్థితి ఉండదు. గతానికి భిన్నంగా కొత్త తరహా నిర్ణయాలు తీసుకుంటే నిలువరించటం.. ప్రశ్నించటం లాంటివి చేయటం పెద్దగా ఉండవు. ముఖ్యమంత్రులు మారినప్పుడు.. సెక్రటేరియట్ కు మీడియా రాకపై ఆంక్షలు విధిస్తే.. దమ్ముగా నిలదీసే మీడియా సంస్థలు దేశంలో ఎన్ని అంటే సమాధానం వెనువెంటనే చెప్పలేం.

అలాంటి పరిస్థితే అమెరికాలో ఏర్పడితే అక్కడ మీడియా ఎలా రియాక్ట్ అవుతుందన్నదానికి తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలే నిదర్శనంగా చెప్పాలి. మరో రోజు వ్యవధిలో.. అమెరికా అధ్యక్ష పీఠం మీద ట్రంప్ కూర్చోనున్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైట్ హౌస్ లో మీడియా  కార్యాలయాల్ని తొలగించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న విషయంపై అమెరికన్ మీడియా ఘాటుగా రియాక్ట్ అయ్యింది.

ప్రమాణస్వీకారం చేయటానికి రెండు రోజుల ముందు.. అమెరికన్ పాత్రియేకులు ట్రంప్ కు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో తమ స్వేచ్ఛ గురించి నొక్కి చెప్పటమే కాదు.. తమను అణిచేయాలని అనుకున్నా..ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తే అందుకు తాము సిద్ధంగా లేమన్న సందేశాన్ని చెప్పకనే చెప్పేశారు. ‘పాఠకులకు ఏం ఇవ్వాలో మేం నిర్ణయిస్తాం తప్ప మీరు కాదు’’ అని అమెరికన్ వార్తా సంస్థలు తేల్చి చెప్పాయి.

‘‘మీ వార్తలు కవర్ చేయకుండా వార్తా సంస్థలను మీరు నిషేధించారు. రిపోర్టర్లను బెదిరించటానికి ట్విట్టర్ ను వాడుకున్నారు. మీ మద్దతుదారులను కూడా అలాగే చేయాల్సిందిగా ప్రోత్సహించారు. మీకు నచ్చని విషయాలు రాసినందుకు వికలాంగుడైన రిపోర్టర్ ను ఎగతాళి చేశారు. వార్తా సంస్థలతో ఎలా వ్యవహరించాలని మీరు నిర్ణయించుకున్నట్లే.. ప్రెస్ కు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. మీరు ప్రభావితం చేయాలనుకుంటున్నది మా ప్రసారాల్లో కొంత సమయాన్ని.. మా వ్యాసాల్లో కొంత చోటును. అయితే.. మా పాఠకులకు.. శ్రోతలకు.. ప్రేక్షకులకు ఉత్తమంగా ఎలా వార్తలు ఇవ్వాలో నిర్ణయించేది మీరు కాదు మేం’’ అని ధైర్యంగా చెప్పేశారు. ట్రంప్ అధికారాన్ని చేపట్టకముందు ఇంతలా చెప్పిన వారు.. రేపు అధికారాన్ని చేపట్టిన తర్వాత కూడా అంతే ధీటుగా సమాధానాలు ఇస్తారా? అన్నది కాలం మాత్రమే తేల్చి చెప్పగలదేమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News