అమెరికా వెళ్ళిపోయింది ..ఇక ఆఫ్ఘన్ పరిస్థితి ఏంటి ?

Update: 2021-09-01 17:30 GMT
ఆఫ్ఘానిస్తాన్ అభివృద్ధి లో ఓ వందేళ్లు వెనక్కి వెళ్లినట్టే నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలోనే ఆఫ్ఘానిస్తాన్ పరిస్థితి అంతమాత్రంగానే ఉండేది. కానీ, అమెరికా ఆఫ్ఘానిస్తాన్ నుండి వెనక్కి వెళ్లిపోయిన మరుక్షణమే దేశం మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అమెరికా , నాటో దళాలు ఇన్ని రోజులు ఆఫ్ఘన్ ను కాపాడుకుంటూ వచ్చాయి. అయితే, అమెరికా ఆఫ్ఘన్ ను ఖాళీ చేస్తున్నాం అని ప్రకటించగానే మొత్తం అక్కడి పరిస్థితులు తారుమారైయ్యాయి. కాబూల్ ఎయిర్‌ పోర్ట్ నుంచి అమెరికా బ‌ల‌గాలు పూర్తిగా త‌ప్పుకున్నాక తాలిబ‌న్లు ఎయిర్‌ పోర్ట్‌ ను త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు.

అమెరికా బ‌ల‌గాలు పూర్తిగా వెళ్లిపోవడం తో ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఎంటి అన్న‌ది మిలియ‌న్ డాలర్ల ప్ర‌శ్న‌. తాము మారిపోయామ‌ని, అంద‌రికి స‌మాన‌మైన హ‌క్కులు ఇస్తామ‌ని, మ‌హిళ‌ల‌ను గౌవ‌విస్తామ‌ని చెబుతున్నా, ఇప్ప‌టికే తాలిబ‌న్లు వారి అరాచ‌క పాల‌న‌కు శ్రీకారం చుట్టారు. త‌మ‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసిన వారిని క‌ఠినంగా శిక్షిస్తున్నారు. మ‌హిళ‌లు బ‌య‌ట‌కు రావొద్ద‌ని, టీవీ, రేడియోల‌లో మ‌హిళ‌ల వాయిస్ అవ‌స‌రం లేద‌ని ఇప్ప‌టికే హుకుం జారీ చేశారు. ఇక ఇదిలా ఉంటే, మ‌హిళ‌లు యూనివ‌ర్శిటీల‌లో చ‌దువుకోవ‌చ్చిని చెబుతూనే, కో ఎడ్యుకేషన్ కి తాము వ్య‌తిరేక‌మ‌ని చెబుతున్నారు.

అమెరికన్లు ఖాళీ చేసి వెళ్లక ముందే ఆ దేశంలో తాలిబ‌న్ల‌కు వ్య‌తిరేక శ‌క్తులైన ఐసిస్ ఉగ్ర‌వాదులు దాడులు చేశాయి. కాబూల్ ఎయిర్‌పోర్టుకు స‌మీపంలో ఆత్మాహుతి దాడులు చేశారు. కాబట్టి ఇక ఇప్పుడు అక్కడ అమెరికా కూడా లేదు. కాబట్టి ఆఫ్ఘన్ ఉగ్రవాదానికి కేరాఫ్ గా మారే అవకాశం కూడా ఉందంటూ పలువురు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘన్ లో తాలిబన్లు తాత్కాలిక శాఖ‌ల‌ను ఏర్పాటు చేసి మంత్రుల‌ను నియ‌మిస్తోంది. పూర్తిస్థాయిలో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత తాలిబ‌న్లు ఎలా ప‌రిపాలించ‌బోతున్నారు అన్న‌ది అందరికి ఉత్కంఠంగా మారింది.

తాలిబ‌న్ల చెర‌లోకి ఆఫ్ఘ‌న్ వెళ్లిన వెంట‌నే విదేశీ నిథులను అమెరికా ఫ్రీజ్ చేసింది. 9 బిలియ‌న్ డాలర్ల విదేశీ మార‌క నిల్వల‌ను ఫ్రీజ్ చేయ‌డం తాలిబ‌న్ల‌కు ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఆఫ్ఘ‌న్ ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా వ‌ర‌కు విదేశాల నుంచి వ‌చ్చే నిధుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఆఫ్ఘ‌నిస్తాన్‌ లో స‌హ‌జ‌వ‌న‌రులు ఉన్న‌ప్ప‌టికీ వాటిని వినియోగించుకోవ‌డానికి తగిన‌న్ని వస‌తులు లేవు. పైగా నిత్యం ప్రభుత్వానికి, ముష్క‌రుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకొవ‌డంతో అభివృద్ధి మ‌చ్చుకైనా క‌నిపించ‌లేదు. వార్‌ ఫైట‌ర్స్‌ కు, తాలిబ‌న్ నేత‌ల‌కు మ‌ధ్య పొంత‌న లేద‌ని స్ప‌ష్టంగా అర్ధం అవుతున్న‌ది. మ‌హిళ‌ల‌ను ఎలా గౌర‌వించాలో త‌మ ఫైట‌ర్స్‌ కు తెలియ‌ద‌ని, వారికి ట్రైనింగ్ ఇస్తామ‌ని, అప్ప‌టి వ‌ర‌కు మ‌హిళ‌లు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అంటున్నారు అంటే వారిలో వారికే స‌రైన క‌మాండింగ్ లేద‌ని స్ప‌ష్టంగా అర్ధం అవుతున్న‌ది.

అమెరికా ద‌ళాలు వెళ్లిపోయిన త‌రువాత తాలిబ‌న్లు గాల్లోకి కాల్పులు జ‌రుపుతూ కేరింత‌లు కొట్టారు. ఆఫ్ఘ‌నిస్తాన్ ఇప్పుడు పూర్తిగా తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లింది. తాలిబ‌న్ నేత‌లు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌లోకి ప్ర‌వేశించారు. ఎయిర్‌ పోర్ట్ మొత్తం క‌లియ‌దిరిగారు. దేశంలోని ప్ర‌జ‌లంద‌రినీ క్ష‌మించేశామ‌ని, పౌరుల‌ను భ‌ద్రంగా చూసుకుంటామ‌ని, సుప‌రిపాల‌న అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆఫ్ఘ‌న్ అభివృద్దికి బాట‌లు వేస్తామ‌ని తెలిపారు. ఎవ‌రూ కూడా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని తాలిబ‌న్లు మ‌రోమారు పేర్కొన్నారు. అయితే, తాలిబ‌న్ల‌పై ఉన్న భ‌యంతో ఇప్ప‌టికే దాదాపు 5 ల‌క్ష‌ల మందికి పైగా ప్ర‌జ‌లు ఆఫ్ఘ‌నిస్తాన్‌ ను వ‌ద‌లి వెళ్లిపోయారు.




Tags:    

Similar News