ర‌ష్యాకు మ‌ద్ద‌తా? భార‌త్‌ పై అమెరికా సీరియ‌స్‌!

Update: 2022-03-04 10:30 GMT
ఉక్రెయిన్‌పై ర‌ష్యా కొన‌సాగిస్తున్న యుద్ధంపై ప్ర‌పంచ దేశాల‌న్నీ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ర‌ష్యా దుందుడుకు చ‌ర్య‌ల‌పై మండిప‌డుతున్నాయి. చ‌ర్చ‌ల ద్వారా శాంతి మార్గంలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచిస్తున్నా ర‌ష్యా మొండిప‌ట్టుతో దండ‌యాత్ర చేస్తుండ‌డం ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే అమెరికా, ఐరోపా యూనియ‌న్‌, ఆస్ట్రేలియా త‌దిత‌ర దేశాల‌కు ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించాయి. ఈ నేప‌థ్యంలో భార‌త్ మాత్రం త‌టస్థ వైఖ‌రి అవ‌లంబిస్తోంది. చ‌ర్య‌ల ద్వారా స‌మ‌స్య ప‌రిష్క‌రించుకోవాల‌ని శాంతి వ‌చ‌నాలు చెబుతోంది. దీంతో భార‌త్ తీరుపై అమెరికా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. త‌ట‌స్థం పేరుతో ర‌ష్యాకు మ‌ద్ద‌తునిస్తారా? అని ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం.

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండ‌యాత్ర విష‌యంలో భార‌త్ అనుస‌రిస్తున్న వైఖ‌రిపై అంత‌ర్జాతీయంగా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉక్రెయిన్‌లో త‌మ దేశ పౌరులు చిక్కుకుపోయిన‌ప్ప‌టికీ ఆ దేశానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా త‌ట‌స్థంగా ఉండ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. త‌ట‌స్థ వైఖ‌రి పేరుతో ర‌ష్యాకు అండ‌గా నిల‌వ‌డంపై అమెరికా వంటి దేశాలు భార‌త్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. అమెరికా త‌న అస‌హ‌నాన్ని నేరుగా భార‌త దౌత్య‌వేత్త‌ల‌కు తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం.  ద‌శాబ్దాలుగా అంత‌ర్జాతీయ అంశాల్లో భార‌త్ అవ‌లంబిస్తున్న త‌ట‌స్థ వైఖ‌రినే ఇప్పుడు ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం విష‌యంలోనూ కొన‌సాగిస్తోంది.

బ‌ల‌హీన‌మైన ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా త‌ట‌స్థం పేరుతో ర‌ష్యాకు ప్ర‌యోజ‌నం చేకూర్చ‌డంపై భార‌త్ వైఖ‌రి ప‌ట్ల అమెరికా దాని మిత్ర‌దేశాలు గుర్రుగా ఉన్నాయి. నేరుగా యుద్ధంలో దిగ‌న‌ప్ప‌టికీ ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తుగా అమెరికా, దాని మిత్ర దేశాలు ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించిన సంగ‌తి తెలిసిందే. కానీ మ‌రోవైపు భార‌త్‌తో పాటు యూఏఈ కూడా త‌ట‌స్థంగా ఉండ‌డం అమెరికాకు మింగుడుప‌డ‌డం లేదు. ర‌ష్యాతో చిర‌కాల స్నేహం నేప‌థ్యంలోనే భార‌త్‌, యూఏఈ ఇలా త‌ట‌స్థంగా ఉంటున్నాయ‌ని అమెరికా అనుమానిస్తోంది.

ఐరాస భ‌ద్ర‌తామండ‌లితో పాటు సాధార‌ణ స‌మావేశాల్లోనూ ర‌ష్యాకు వ్య‌తిరేకంగా ప్ర‌పంచ దేశాలు ప్ర‌వేశ‌పెడుతున్న తీర్మానాల్లో ఓటింగ్‌కు భార‌త్ దూరంగా ఉంటుంది. దీంతో అది పుతిన్‌కు క‌లిసొస్తుంద‌ని అమెరికా ఆరోపిస్తోంది. ఇప్ప‌టికే భార‌త వైఖ‌రి ప‌ట్ల పుతిన్ ధ‌న్య‌వాదాలు కూడా తెలిపాడు. దీంతో భార‌త్‌, యూఏఈ దేశాలు ర‌ష్యా క్యాంపులో ఉన్నాయా? అని దౌత్య‌వేత్త‌ల‌తో అమెరికా అన్న‌ట్లు తెలిసింది. త‌ట‌స్థ వైఖ‌రి వల్ల ఉక్రెయిన్ కంటే ర‌ష్యాకే ఎక్కువ మేలు జ‌రుగుతోంద‌ని అమెరికా ఆరోపిస్తోంది.
Tags:    

Similar News