తుపాకీ మార‌ణ‌హోమం ఆగ్ర‌రాజ్యానికి ఎందుకు ప‌ట్ట‌దు?

Update: 2017-10-04 04:55 GMT
అమెరికాలో అక్ష‌రాల 3300 రూపాయిలు ఖ‌ర్చు పెడితే ఎంత భారీ విధ్వంసం సృష్టించవ‌చ్చో తెలుసా? ఎన్ని ప్రాణాలు తీసేసే అవ‌కాశం ఉందో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. మ‌న సూప‌ర్ మార్కెట్లో ఏ విధంగా అయితే ప‌ప్పులు.. పౌడ‌ర్లు కొనేస్తామో.. అమెరికాలో ఆయుధాల్ని బిస్కెట్‌.. చాక్లెట్లు కొన్నంత సింఫుల్ గా కొనేయొచ్చు. బ‌జార్లో దొరికే రైఫిళ్ల‌కు బంప్ స్టాక్ ను అమ‌రిస్తే చాలు.. దారుణ‌మైన మార‌ణ‌హోమానికి  అవ‌కాశం ఉంది. ఒక రైఫిల్ కు రూ.3300 ఖ‌ర్చుతో ఒక బంప్ స్టాక్ అమ‌ర్చిన వెంట‌నే అదో మెషిన్ గ‌న్ మాదిరి మారుతుంది. దీంతో నిమిషానికి 400 నుంచి 800రౌండ్ల వ‌ర‌కూ కాల్పులు జ‌రిపే వీలుంది.

ఈ బంప్ స్టాక్ తో రైఫిళ్ల షోల్డ‌ర్ రెస్ట్ స్థానాన్ని భ‌ర్తీ చేసే ఈ ప‌రిక‌రంతో ట్రిగ్గ‌ర్‌ ను క‌ప్పిపుచ్చే వీలుంది. ట్రిగ్గ‌ర్‌ ను మ‌ళ్లీ మ‌ళ్లీ లాగాల్సిన ప‌ని లేకుండా చేసే ఈ సాధ‌నంతోనే లాస్ వేగాస్ లో అంత‌టి మార‌ణ‌హోమాన్ని సృష్టించారు. ఆయుధాల్ని స్వేచ్ఛ‌గా అమ్మేసే అమెరికా స‌మాజంలో గ‌న్ క‌ల్చ‌ర్ ఇప్ప‌టికే భారీ న‌ష్టాన్ని మిగిల్చింది. అయిన‌ప్ప‌టికీ ఈ గ‌న్ క‌ల్చ‌ర్‌ కు ముకుతాడు వేయ‌టానికి అగ్ర‌రాజ్యం సిద్ధంగా లేదనే చెప్పాలి. ఎందుకిలా? ఓప‌క్క అమాయ‌కుల ప్రాణాలు పోతున్నా.. గ‌న్ క‌ల్చ‌ర్ కు చెక్ చెప్పేలా నియంత్ర‌ణ‌ల మీద అమెరిక‌న్ ప్ర‌భుత్వం ఎందుకు దృష్టి సారించ‌ద‌న్న విష‌యాన్ని చూసిన‌ప్పుడు ఒక ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తుంది.

ఆయుధాల మీద యావను ప్ర‌ద‌ర్శించే అమెరికా.. వాటిని ఎందుకు వ‌దులుకోదంటే.. దాని మీద వ‌చ్చే ఆదాయం భారీగా ఉండ‌ట‌మే. అమెరికాలో ఫ్రీ గ‌న్ క‌ల్చ‌ర్ కార‌ణంగా ఏటా రూ.10వేల కోట్లకు త‌గ్గ‌కుండా ఆదాయం ఖ‌జానాకు చేరుతుంది. ఈ కార‌ణంతోనే గ‌న్ల మీద ప‌రిమితులు విధించ‌టానికి అగ్ర‌రాజ్యం పెద్ద‌గా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌రు.

చేతిలో గ‌న్ వ‌చ్చాక‌.. ఆ వ్య‌క్తికి విచ‌క్ష‌ణ లోపిస్తే ఎంత‌టి భ‌యాన‌క ప‌రిస్థితులు ఏర్ప‌డతాయ‌న‌టానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా లాస్ వేగాస్ ఉదంతాన్ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక ఉన్మాది హోట‌ల్ 32వ అంత‌స్తులోని గ‌దిలో కూర్చొని తుపాకీతో విచ‌క్ష‌ణార‌హితంగా జ‌రిపిన కాల్పుల కార‌ణంగా 59 మంది మ‌ర‌ణిస్తే.. 515 మంది తీవ్ర గాయాల‌పాల‌య్యారు. ఇక‌.. వేలాది మంది త‌మ ప్రాణాలు ద‌క్కించుకోవ‌టానికి ప‌డిన ప్ర‌యాస అంతా ఇంతా కాదు.

ఈ ఘాతుకాన్ని ఉగ్ర‌వాద చ‌ర్య‌గా చెబుతూ.. త‌మ అకౌంట్లో వేసుకోవ‌టానికి ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్‌) కిందా మీదా ప‌డుతున్నా..అలాంటి వాటికి సంబంధించిన ఆధారాలు ల‌భించ‌లేద‌ని చెబుతున్నారు. విషాద‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే అంటువ్యాధుల కంటే కూడా అమెరికాలో ఆయుధాల కార‌ణంగా మ‌ర‌ణించే వారి సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌టం.

ఆయుధాల అమ్మ‌కాల‌తో ప్ర‌భుత్వానికి వ‌చ్చే వేలాది కోట్ల రూపాయిల్ని వ‌దులుకోవ‌టం ఇష్టం లేక‌నే.. విచ్చ‌ల‌విడిగా ఉప‌యోగించే ఆయుధాల విష‌యంలో ఉదాసీనంగా ఉన్న‌ర‌ని చెప్పాలి. తుపాకీలు కొంటున్న వారు ఎవ‌రో?  వారికి ఆ అవ‌స‌రం ఎందుకు? అన్న ప్ర‌శ్న‌ల్ని వేయ‌ని ప్ర‌భుత్వ తీరు అమెరికాలో క‌నిపిస్తుంది. ఇదే.. లాస్ వేగాస్ ఉన్మాద ఉదంతాల‌కు కార‌ణంగా మారుతుంద‌ని చెప్పాలి. లాస్ వేగాస్ లో దారుణానికి పాల్ప‌డిన ఉన్మాది స్టీఫెన్ పెడాక్ విష‌యాన్నే తీసుకుంటే.. అత‌డు చాలా సింఫుల్ గా బ‌తికే వ్య‌క్తి అని.. అత‌నికి ఏ ఉగ్ర‌వాద సంస్థ‌తోనూ సంబంధాల్లేవ‌ని చెబుతున్నారు. పోలీసులు సైతం.. స్టీఫెన్ మీద ఎలాంటి కేసులు లేవ‌ని చెబుతున్నారు.

మ‌రింత సాదాసీదా వ్య‌క్తి అంత ఉన్మాదానికి ఎందుకు పాల్ప‌డిన‌ట్లు? అన్న‌ది ప్ర‌శ్న‌. అత‌గాడి తీరు అంతా బాగానే ఉంద‌నుకుంటే.. హోట‌ల్ రూం తీసుకొని 45 తుపాకీలు త‌న గ‌దిలో పోగుపోసుకున్నాడంటే దానికి ఏమ‌నాలి? ఒక వ్య‌క్తి అదే ప‌నిగా పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయ‌టాన్ని అమెరిక‌న్ స‌మాజం ఎందుకు గుర్తించ‌దు?  చేతితో ఆయుధం సామాజిక హోదాగా భావించే అమెరికాలో.. ఇప్ప‌టికైనా అక్క‌డి ప్ర‌భుత్వాలు క‌ళ్లు తెర‌వ‌కున్నా.. ఆయుధాల‌తో వ‌చ్చే వేలాది కోట్ల‌ను వ‌దులుకోవ‌టానికి సిద్ధం కాకున్నా.. లాస్ వేగాస్ లాంటి దారుణాలు మ‌రిన్ని జ‌రుగుతాయ‌న‌టంలో సందేహం లేదు.
Tags:    

Similar News