ట్రంప్‌.. కిమ్ భేటీపై అమెరికా మీడియా ఏమంది?

Update: 2018-06-13 05:18 GMT
ప్ర‌పంచానికి పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రించే అగ్ర‌రాజ్యంలో మీడియా కూసింత స్వేచ్ఛ‌తో వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్న ప్ర‌భుత్వానికి తొత్తుగా కాకున్నా.. కొంత సానుకూలంగా వ్య‌వ‌హ‌రించే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటుంది. అయితే.. అమెరికా అధ్య‌క్ష ప‌ద‌విలోకి ట్రంప్ వ‌చ్చాక‌.. అమెరికా స‌ర్కారుకు.. మీడియాకు మ‌ధ్య దూరం పెరిగింది.

ట్రంప్ తీరును.. ఆయ‌న విధానాల్ని అమెరికా మీడియా తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకిస్తుంటే.. అమెరికా మీడియాను ట్రంప్ ఎప్ప‌టిక‌ప్పుడు వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంటారు. త‌న‌ను ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు కొన్ని టార్గెట్ చేసిన‌ట్లు ఆయ‌న మాట‌లు ఉంటాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ తో భేటీ కోసం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌పై అమెరికా మీడియా ఏమంది? ఎలాంటి తీర్పును ఇచ్చింద‌న్న‌ది చూస్తే.. తాజా భేటీ ఫెయిల్ అంటూ అభివ‌ర్ణించింది.

ఎందుక‌లా అంటే.. నిల‌క‌డ లేని ఇద్ద‌రు నేత‌లు ప్ర‌ద‌ర్శించిన ప్రేమాభిమానాలు ఎంత కాలం ఉంటాయ‌న్న‌ది అతి పెద్ద ప్ర‌శ్న‌గా చెబుతున్నారు. మీడియా ఎదుట ఇరువురు అధినేత‌లు ప్ర‌ద‌ర్శించిన ప్రేమ ఎంత‌కాలం అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా వేస్తున్నారు. అమెరికా మీడియా విశ్లేష‌ణ ప్ర‌కారం.. తాజా భేటీలో కిమ్ గెలిచార‌ని..ట్రంప్ ఓడిన‌ట్లుగా విశ్లేషించాయి. ఎందుక‌లా.. అంటే కిమ్ ను కీల‌క అంశాల్లో ఒప్పించ‌లేక‌పోవ‌టం ట్రంప్ ఫెయిల్యూర్ గా అభివ‌ర్ణిస్తున్నారు.

అయితే.. ట్రంప్ మాత్రం త‌న‌ది గెలుపుగా చెప్పుకుంటున్నారు. ఈ త‌ర‌హా భేటీ ప్ర‌పంచం సైతం ఊహించ‌నిది అంటూ ట్రంప్ వ్యాఖ్య‌లు చూస్తే.. స‌మావేశంలో జ‌రిగే ఒప్పందాలు.. తీసుకునే నిర్ణ‌యాల కంటే కూడా.. తాము ఇరువురం క‌లిసి మాట్లాడుకోవ‌ట‌మే అతి పెద్ద విజ‌యంగా ఆయ‌న భావిస్తున్న‌ట్లుగా ట్రంప్ మాటు ఉన్నాయి.

అయితే..ట్రంప్ తీరున‌కు భిన్నంగా అమెరికా మీడియా తాజా స‌మావేశాన్ని విశ్లేషించింది. తాజా చారిత్ర‌క భేటీలో కిమ్ గెలిచాడు.. ట్రంప్ ఓడారు అన్న మాట‌ను చెబుతోంది. ఒక కీల‌క స‌మావేశంపై అమెరికా మీడియా ఇచ్చిన తీర్పు ట్రంప్ కు మీడియా ప‌ట్ల మ‌రింత ఆగ్రహాన్ని క‌లిగిస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 
Tags:    

Similar News