ట్రంప్ కు షాకిచ్చిన అమెరికా టీవీ చానెళ్లు

Update: 2020-11-06 15:10 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ అధ్యక్ష ఎన్నికల్లో ఎదురీదుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీనిపై న్యాయపోరాటం చేస్తానని.. అడ్డుకుంటానని.. వివాదాస్పద వ్యాఖ్యలతో అమెరికన్లలో ఉద్రేకాలు రెచ్చగొడుతున్నారు. తాజాగా వైట్ హౌస్ నుంచి ప్రసంగిస్తున్న అమెరికా అధ్యక్షుడికి షాక్ తగిలింది. ట్రంప్ మాట్లాడుతున్న లైవ్ ప్రసారాన్ని కొన్ని టీవీ చానెళ్లు అర్థాంతరంగా నిలిపివేశాయి.

అధ్యక్షుడు ట్రంప్ ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అమెరికాలోని దిగ్గజ మీడియా సంస్థలన్నీ తెలిపాయి. అన్ని చానెల్స్ ఏకమై ట్రంప్ ప్రసంగాన్ని లైవ్ ఇవ్వలేదు.

ట్రంప్ 17 నిమిషాల పాటు మాట్లాడిన ఈ ప్రసంగంలో డెమోక్రాట్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ ఓట్లతో గెలుస్తున్నారని.. లాగేసుకుంటున్నారని.. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రజల్లో విద్వేశాలు రెచ్చగొట్టేలా ట్రంప్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అధ్యక్షుడి లైవ్ ను కొన్ని చానెల్స్ మధ్యలోనే నిలిపివేశాయి. ఎంఎస్ఎన్‌బీసీ, ఎన్‌బీసీ, ఎబీసీ న్యూస్ వంటి ప్రముఖ ఛానెళ్లు కూడా ట్రంప్ లైవ్ కవరేజి ఆపేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇక ట్రంప్ వివాదాస్పద ట్వీట్లను ట్విట్టర్ సైతం నిలిపివేసింది. దీంతో అధ్యక్షుడు ట్రంప్ కు మీడియాలో, సోషల్ మీడియాలో చుక్కెదురవుతోంది.
Tags:    

Similar News