వాద‌న‌లు త‌ర్వాత‌..విందు భోజ‌నం అదిరిపోయింద‌ట‌!

Update: 2018-07-21 05:14 GMT
శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు మొద‌లైన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌.. నాన్ స్టాప్ గా రాత్రి 11 గంట‌ల వ‌ర‌కూ కొన‌సాగ‌టం తెలిసిందే. చివ‌ర‌గా మోడీ ప్ర‌సంగం.. అనంత‌రం కేశినేని నాని స్పంద‌న అనంత‌రం.. ఓట్ల లెక్కింపు చేప‌ట్టారు. భారీ మెజార్టీతో మోడీ స‌ర్కారుకు రావ‌టంతో టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

అవిశ్వాస తీర్మానం పుణ్య‌మా అని.. స‌భ యావ‌త్తు వాడి వేడి వాద‌న‌ల‌తో వేడెక్కిపోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌డియారంలో గంట‌లు కొద్ది సాగుతున్న చ‌ర్చ నేప‌థ్యంలో నేత‌లు ప‌లువురు పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన క్యాంటీన్ కు వెళ్లాల్సి వ‌చ్చింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాత్రి పొద్దుపోయే వ‌ర‌కూ స‌భ జ‌రిగే సూచ‌న‌లు క‌నిపించ‌టంతో.. స‌భ అయిపోయిన త‌ర్వాత క‌మ్మ‌టి భోజ‌నాన్ని నేత‌ల‌కు.. సిబ్బందికి అందించాల‌ని నిర్ణ‌యించారు. కాస్త ఆల‌స్యంగా నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ.. ఏర్పాట్లు మాత్రం ఘ‌నంగానే జ‌రిగాయి. అప్ప‌టిక‌ప్పుడు తీసుకున్న నిర్ణ‌యంతో కూర‌గాయలు.. నిత్య‌వ‌స‌ర సామాన్లు పార్ల‌మెంటు భ‌వన్ కు పోటెత్తాయి.

ప్ర‌త్యేక అనుమ‌తితో ఆలూ.. వెజిట‌బుల్స్ తోపాటు పెద్ద ఎత్తున కూర‌గాయ‌లు.. వంట‌కు అవ‌స‌ర‌మైన ఇత‌ర సామాన్లు బారులు తీరాయి. స‌భ ముగిసే స‌మ‌యానికి.. అంద‌రికి అందేలా జీరా రైస్.. ప‌ప్పు.. రైతా.. రోటీ.. చికెన్ మ‌సాలా.. చేప వేపుడు.. ప‌నీర్ బ‌ఠాణీ.. వెజిట‌బుల్ బిర్యానీ.. ఆనియ‌న్ రైతా లాంటి వంట‌కాల‌తో పార్ల‌మెంటు లోని క్యాంటీన్ ప‌రిస‌రాలు ఘుమ‌ఘుమ‌లాడిపోయాయి. వేడివేడిగా వ‌డ్డిస్తూ.. స‌భ్యులు.. సిబ్బంది ఆక‌లిని తీర్చారు. అప్ప‌టివ‌ర‌కూ స‌భ‌లో వాడీవేడిగా సాగిన ప్ర‌సంగాల‌కు భిన్నంగా.. స‌భ బ‌య‌ట ఘుమ‌ఘుమ‌లాడే వంట‌ల‌తో నోరూరేలా చేశారు.
Tags:    

Similar News