అమిత్ మిశ్రా అరెస్ట్

Update: 2015-10-27 10:11 GMT
 టీమ్ ఇండియా స్పిన్నర్ అమిత్ మిశ్రా అరెస్టయ్యాడు. మహిళపై దాడి కేసులో ఆయన్ను బెంగళూరు పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. తనపై అమిత్ మిశ్రా దాడి చేశాడంటూ ఒక మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఈ రోజు దాదాపు 3 గంటలు విచారించిన పోలీసులు అనంతరం అరెస్టు చేశారు.  అనంతరం మిశ్రా తరఫు న్యాయవాదులు బెయిల్ పేపర్లు దాఖలు చేసి అమిత్ మిశ్రాను విడుదల చేయించారు. సెప్టెంబర్ 25వ తేదీన బెంగళూరులో తాను ఉంటున్న హోటల్ గదిలో ఓ అమ్మాయిపై దాడి చేసినట్లు అమిత్ మిశ్రాపై పోలీసు కేసు నమోదైంది. అయితే.. ఈ కేసును ఆమె ఉపసంహరించుకున్నట్లు తొలుత కథనాలు వచ్చినా, ఆ తర్వాత మళ్లీ కేసు విషయంలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకుంది. దాంతో పోలీసులు కూడా ఈ కేసు విచారణను వేగవంతం చేశారు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ ముగియడంతో.. మంగళవారం ఉదయం పోలీసులు మిశ్రాను విచారించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్లు 354 - 328 కింద మిశ్రాపై కేసు నమోదు చేసినట్టు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు.

కాగా ఇటీవల కాలంలో క్రికెటర్ల ప్రవర్తనపై తరచూ ఏదో ఒక వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఐపీఎల్ జోరు పెరిగిన తరువాత యువ క్రికెటర్లలో క్రమశిక్షణ లోపిస్తోందన్న వాదనా వినిపిస్తోంది.
Tags:    

Similar News