వామ్మో.. ఇదెక్క‌డి బ‌రితెగింపురా బాబు!

Update: 2017-08-02 04:12 GMT
దేశ రాజ‌కీయాల్లో స‌క‌ల ద‌రిద్రాల‌కు కార‌ణం.. కాంగ్రెస్ పార్టీ అని అభివ‌ర్ణించే వారు కొంద‌రు క‌నిపిస్తుంటారు. వారి మాట‌లు విన్న‌ప్పుడు.. ఈ దేశ రాజ‌కీయం ఈ ర‌కంగా త‌గ‌ల‌బ‌డిపోవ‌టానికి కాంగ్రెస్ పార్టీనే కార‌ణ‌మ‌న్న‌ట్లుగా చెబుతుంటారు. ఇందుకు త‌గ్గ‌ట్లే స‌వాల‌చ్చ కార‌ణాల్ని చూపిస్తుంటారు. విలువ‌ల వ‌ల‌వ‌లు తీసేసి.. ప‌వ‌ర్ మాత్ర‌మే ముఖ్య‌మన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన తీరు వారి మాట‌ల్లో క‌నిపిస్తుంటుంది. అయితే.. తాజాగా ప్ర‌ధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాల తీరు చూస్తే.. కాంగ్రెస్ అమ్మ మొగుడిలా క‌నిపించ‌టం ఖాయం.

మోడీ.. అమిత్ షా ద్వ‌యం చేస్తున్న తాజా రాజ‌కీయాల్ని చూస్తున్న ప‌లువురికి నోట మాట రావ‌టం లేదు. గొప్ప విష‌యం ఏమిటంటే.. పార్టీని విస్త‌రించేందుకు.. దేశం మొత్తంగా కాషాయంతో క‌మ్మేయ‌టానికి వారు చేస్తున్న ప్ర‌య‌త్నాల్ని తిట్టిపోసే ధైర్యం కొమ్ములు తిరిగి మీడియాల‌కు లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇంత జ‌రుగుతున్నా దేశ ప్ర‌జ‌ల్లో ఎలాంటి వ్య‌తిరేక‌త వ్య‌క్తం కాక‌పోవ‌టం చూస్తుంటే.. మోడీ.. అమిత్ షాలు ఎంత తెలివైన రాజ‌కీయ నాయ‌కులో అర్థ‌మ‌వుతుంది.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ను చూస్తే జాలి వేయ‌క త‌ప్ప‌దు. క‌క్కుర్తి ప‌నుల‌కు పాల్ప‌డి భారీ ఎత్తున చెడ్డ‌పేరు మూట గ‌ట్టుకునే తీరుకు.. మోడీ.. అమిత్ షాల తీరు భిన్నంగా క‌నిపిస్తారు. గంట‌ల వ్య‌వ‌ధిలో ఒక ప్ర‌భుత్వాన్ని కూల్చేసి.. త‌మ అండ‌తో మ‌రో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేలా చేసినా.. మ‌రీ ఇంత బ‌రితెగింపా? అన్న భావ‌న మెజార్టీ ప్ర‌జ‌ల‌కు అస్స‌లు క‌లగ‌కుండా చేయ‌టం చూసినప్పుడు వారి మేథోత‌నానికి వ‌ణికిపోవాల్సిందే. బిహార్ ఆప‌రేష‌న్ ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన ఈ పొలిటిక‌ల్ డాక్ట‌ర్లు.. ఇప్పుడు ఒకే స‌మ‌యంలో  మ‌రిన్ని ఆప‌రేష‌న్లు చేస్తున్న వైనం చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే.. ఒక డాక్ట‌ర్ ఒక స‌మ‌యంలో ఒక ఆప‌రేష‌న్ మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. కానీ.. ఈ పొలిటిక‌ల్ డాక్ట‌ర్లు మాత్రం ఒకే స‌మ‌యంలో చేస్తున్న ప‌లు ఆప‌రేష‌న్లు దేశ రాజ‌కీయ పార్టీల‌కు స‌రికొత్త విధానాల్ని ప‌రిచ‌యం చేసేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. రాజ‌కీయ విలువ‌ల్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి చేస్తున్న ఈ రాజ‌కీయ ఆప‌రేష‌న్లు అన్ని విజ‌య‌వంతంగా న‌డ‌వ‌టం ప‌లువురు సంప్ర‌దాయ ప్ర‌జాస్వామికవాదులకు ఏ మాత్రం మింగుడు ప‌డ‌ని రీతిలో త‌యార‌య్యాయ‌ని చెప్పాల్సిందే.

వివిధ రాష్ట్రాల్లో ఒకే స‌మ‌యంలో మోడీ.. అమిత్ షాలు చేస్తున్న పొలిటిక‌ల్ ఆప‌రేష‌న్ల‌ను చూస్తే.. ప్ర‌త్య‌ర్థుల‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేయ‌టం.. మ‌ళ్లీ కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్ట‌టం ఒక ఎత్తు అయితే.. ఇంత చేస్తున్నా పెద్ద‌గా విమ‌ర్శ‌లు త‌లెత్త‌కుండా.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్తం కాకుండా చూసుకోవ‌టం మ‌రో ఎత్తు. చేతిలో ఉన్న అధికారాన్ని తిరుగులేని రీతిలో మార్చుకోవ‌టం.. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రూ స‌మీప భ‌విష్య‌త్తులో కోలుకోలేని రీతిలో  దెబ్బ తీయ‌టం మోడీ.. అమిత్ షా ద్వ‌యం ప్ర‌త్యేక‌త‌గా చెప్పాలి. త‌మ ఉక్కు పిడికిలికి రాజ‌కీయ పార్టీలు విల‌విల‌లాడిపోయేలా చేయ‌టం ఈ ఇద్ద‌రు నేత‌లకు మాత్ర‌మే సాధ్య‌న్న‌ట్లుగా ఇప్పుడు ప‌రిస్థితులు త‌యార‌య్యాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తెర వెనుక గుట్టు చ‌ప్పుడు కాకుండా పావులు క‌ద‌ప‌టం.. త‌మ చేతికి మ‌ట్టి అంట‌కుండా చూసుకోవ‌టం.. మేథావులు మొద‌లు సాదాసీదా ప్ర‌జ‌లు సైతం తాము చేస్తున్న ర‌హ‌స్య పొలిటిక‌ల్ ఆప‌రేష‌న్లకు వ్య‌తిరేక‌త వ్య‌క్తం కాకుండా చూసుకోవ‌టం ఈ టాప్ బీజేపీ నేత‌ల‌కే చెల్లింద‌ని చెప్పాలి. ముగిసిన బిహార్ ఎపిసోడ్‌ ను ప‌క్క‌న పెడితే.. మ‌రికొద్ది నెల‌ల్లో ముంచుకొస్తున్న  గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఊహించ‌ని రీతిలో విప‌క్ష కాంగ్రెస్‌ కు దిమ్మ తిరిగిపోయే షాకిచ్చారు మోడీ.. అమిత్ షాలు.

ఆ రాష్ట్రంలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని బీజేపీలో చేరిపోయేలా చేసిన వీరి దెబ్బ‌కు.. ఇక ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చినా మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు కాషాయ జెండా నీడ‌లోకి వెళ్లిపోతారేమోన‌న్న భ‌యాన్ని కాంగ్రెస్‌ కు క‌లిగించ‌ట‌మే కాదు.. గుజ‌రాత్ నుంచి త‌మ ఎమ్మెల్యేల‌ను బెంగ‌ళూరుకు హుటాహుటిన త‌ర‌లించేలా చేశార‌ని చెప్పాలి. ఈ హ‌డావుడి ఓ ప‌క్క‌న సాగుతున్న వేళ‌లోనే.. మ‌రోవైపు త‌మిళ‌నాడులోనూ త‌మ‌దైన పావుల్ని క‌ద‌ప‌టం మొద‌లెట్టారు మోడీ.. అమిత్ షాలు.

ఎప్ప‌టి నుంచో త‌మ బ‌ల‌మైన ముద్ర‌ను ద‌క్షిణాదిన వేయాల‌ని త‌పిస్తున్న క‌మ‌ల‌నాథుల క‌ల‌ను నిజం చేస్తూ.. అధికార అన్నాడీఎంకే పార్టీ ఎన్డీయేలో చేరేందుకు రంగం సిద్ధం చేయ‌టంలో స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి. త‌మిళ‌నాడు ప‌రిస్థితులు త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌టం స‌క్సెస్ అయిన బీజేపీ నేత‌లు ఇప్పుడు యూపీలో విప‌క్ష స‌మాజ్ వాదీ పార్టీని టార్గెట్ చేయ‌టం షాకింగ్ గా మారింది. ఇక్క‌డ స‌మాజ్ వాదీ నేత‌లు కాషాయ కండువా క‌ప్పుకునేందుకు గ‌తంలో ఎప్పుడూ లేనంత హుషారును ప్ర‌ద‌ర్శించ‌టం కీల‌క ప‌రిణామంగా చెప్పాలి. ఇలా.. ఒకే స‌మ‌యంలో ప‌లు రాష్ట్రాల్లో త‌మ‌దైన పొలిటిక‌ల్ ఆప‌రేష‌న్లు చేస్తున్న మోడీ.. అమిత్ షాలు ఇక్క‌డితో ఆపుతారా? మ‌రికొన్ని రాష్ట్రాల్ని గురి పెడ‌తారా? అన్నది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News