అమిత్ షా దెబ్బకు దిగివచ్చిన ఏపీ బీజేపీ నేతలు

Update: 2021-11-16 17:30 GMT
ప్రజల్లో అంసతృప్తికి ఊపిరులూదాలి.. ఉద్యమాన్ని రగిలించాలి.. ప్రజలకు అండగా నిలుస్తూ వారి అభిమానాన్ని పొందాలి. ఆ అభిమానమే ఆలంబనగా అధికార సింహాసనాన్ని అధిరోహించాలి... ఈ ఫార్ములా అన్ని పార్టీలకు తెలిసినా కూడా ఏపీలో బీజేపీకి తెలినట్టు లేదు..! ప్రజల్లో ముఖ్యంగా అమరావతి రైతుల్లో నెలకొన్న అసంతృప్తి మహా పాదయాత్రలో వ్యక్తమవుతున్నా కూడా తమకేం సంబంధం లేనట్టు.. పార్టీని రాష్ట్రంలో మరింతగా విస్తరించే అవకాశం కళ్లముందే ఉన్నా ముఖం తిప్పుకుంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలని కొందరు లీడర్లు అంటుంటే మరికొందరు మాత్రం మనకేం సంబంధం లేదన్న సంకేతాలిస్తూ క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా అమిత్ షా చెవిన పడటంతో.. ఆయన బీజేపీ నేతలపై కస్సుమన్నాడు. వెంటనే రంగంలోకి దిగండంటూ దిశానిర్దేశం చేశారు.

దేవుడికైనా దెబ్బే గురువు అన్నారు. అధినేత దెబ్బకు ఏపీ బీజేపీ నేతలు దిగివచ్చారు.  అమరావతి ఉద్యమానికి మద్దుతు ఇవ్వాలని కాషాయ పార్టీ స్పష్టం చేసింది. అయితే రాజధాని రైతుల చేస్తున్న న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్రపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పిన మాటలకు.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ సునీల్‌ దియేదర్‌ చేస్తున్న సూచనలకు పొంతన ఉండడం లేదు. దీంతో కాషాయ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. రాష్ట్ర నేత ఓ మాట.. ఇన్ చార్జ్ మరో మాట చెప్పడంతో ఎటు తేల్చుకోలేక బీజేపీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.  పాదయాత్రలో పాల్గొనాలా.? వద్దా..? అనే అంశంపై  ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఈ విషయం అటు ఇటు చేరి చివరికి అమిత్ షా చెవిలో పడింది. ఇంకేముందు ఆయన నేతలకు వార్నింగ్ ఇచ్చారట. దీంతో  అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. అవసరమైన సందర్భాలలో యాత్రలో పాల్గొంటామని బీజేపీ నేతలు తెలిపారు. రాష్ట్ర నేతల వ్యవహార శైలిపై నిన్న తిరుపతిలో అమిత్ షా క్లాస్ తీసుకున్నారు.  రైతుల మహా పాదయాత్రలో ఎందుకు పాల్గొనలేదని అమిత్‌షా నిలదీసినట్లు సమాచారం.

తిరుపతిలో రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు గతంలో రాష్ట్ర ఇన్ చార్జీలుగా వ్యవహరించిన నేతలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం హాట్ హాట్ గా సాగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ అమరావతి రైతులకు మద్దతు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం  నిర్ణయం తీసుకుంది. అయితే నేతలు కార్యకర్తల్లో గందరగోళం సృష్టించారు. అమిత్ షాతో భేటీ అనంతరం ఈ రోజు రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమానికి రాష్ట్ర నేతలు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. దీన్ని బట్టి అమిత్ షా రాష్ట్ర నేతలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీకి ఆశించినంత మద్దతు లేకపోయినా ఒక మేరకు ప్రజల నుంచి మద్దతు వస్తోందని చెబుతున్నారు. ఇక ఏపీలో కూడా విస్తరించాలని కాషాయపార్టీ పావులు కదుపుతోంది. అయితే నేతల మధ్య సమన్వయ లోపం వల్ల ఆశించినంతగా పార్టీ పురోగతి సాధించలేదనే విమర్శలు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో పార్టీ పురోగతిపై అమిత్ షా కీలకమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. విరుద్దమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేతలను ఆయన తలంటినట్లు చెబుతున్నారు. అమిత్ షా సమావేశం అంతా అమరావతి రాజధాని రైతుల ఉద్యమం చుట్టు తిరిగినట్లు చెబుతున్నారు.

రాజధాని రైతులు భూములు త్యాగాలు చేశారని,  అమరావతికి అనుకూలంగా పార్టీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసిందని అమిత్ షా నేతల దృష్టికి తెచ్చారు. పార్టీ అభిప్రాయానికి  భిన్నంగా ఇక్కడి నేతలు వ్యవహరిస్తున్నారని వారించినట్లు తెలుస్తోంది. మనం ప్రజలకు డిమాండ్లకు అనుకూలంగా ఉండాలని, రాజధాని రైతుల పాదయాత్రకు పల్లెల్లో పూలు జల్లి హారతులిస్తున్నారని తెలిపారు. దేవాలయానికి వెళ్లే మహిళా రైతులకు మద్దతివ్వకపోవడం తప్పిందమేనని అమిత్ షా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఉద్యమంలా సాగుతున్న అమరావతి పాదయాత్రలో ఎందుకు పాల్గొనడం లేదని అమిత్ షా సూటిగా  ప్రశ్నించారని చెబుతున్నారు. ఆయనకు  సమాధానాలు చెప్పలేక రాష్ట్ర నేతలు తికమక పడ్డారట. అమరావతి పాదయాత్రలో పాల్గొనాలని నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారని చెబుతున్నారు. ఏపీ ఇన్ చార్జీ సునీల్‌ దియేదర్‌ పార్టీ నేతలకు ఫోన్లు చేస్తూ అమరావతి పాదయాత్రలో పాల్గొనవద్దని చెప్పడం..అమిత్‌షా దృష్టికి వెళ్లిందట. దీంతో అమరావతి ఏకైక రాజధానిగా పార్టీ తీర్మానం చేసిన తర్వాత పాదయాత్రకు మద్దతు ఇవ్వకపోతే ప్రజలేమనుకుంటారని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఓ దశలో అమిత్ రాష్ట్ర నేతల తీరుపై తీవ్ర అసహానానికి గురయ్యారట.  పదే పదే తప్పులు చేస్తూ బాగుండదని అమిత్‌షా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News