అమిత్ షా లెక్కలు చూసి సిగ్గు పడాల్సింది ఎవరు? 1

Update: 2016-03-07 07:04 GMT
పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారు? పిల్లాడు పుట్టిన నాటి నుంచి వాడిదే లోకంగా.. వాడి కోసం తపిస్తూ.. ఏం చేసేందుకైనా సిద్ధం అన్నట్లుగా వ్యవహరిస్తారా? లేక.. పిల్లాడు పొట్టలో పడిన క్షణం నుంచి ఓ పెద్ద పుస్తకం పెట్టి.. లెక్కలు రాస్తూ.. వాడు కడుపులో పెరిగేందుకు వాడిన ఐరెన్ ట్యాబ్లెట్ల దగ్గర నుంచి... వాడి ఎదుగుదల ఎలా ఉందంటూ డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్ట్ చేయించుకున్నందుకు అయిన కన్సల్టేషన్ ఫీజు మొదలు.. ఆటో ఖర్చు వరకూ రాసుకుంటారా? పిల్లాడు ఎప్పుడైనా కోపంతో.. నాన్న నాకేం చేయటం లేదంటే.. అరే.. వెధవ.. నేను నీకు చేయకపోవటమా? అని గట్టిగా అరిచి.. తాను రాసిన పెద్ద బౌండ్ ను ముఖాన పడేస్తే.. పిల్లాడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది?

ఇన్ని లెక్కలు రాసేటోడివి అసలు నన్నెందుకు పుట్టించావ్? నేనేమైనా నిన్ను పుట్టించమని అడిగానా? అని కోపంతో ప్రశ్నించటం కామన్. తాజాగా.. బీజేపీ యవ్వారం కూడా ఇంచుమించు అదే తీరులో ఉంది. తాను అడగకుండానే తనను రెండు ముక్కలు చేయటం ఒకటైతే.. దాని కారణంగా తనకు వచ్చి పడే కష్టాల గురించి ఏకరవు పెడితే.. మేం ఉన్నాం.. మేం చూసుకుంటామన్న ధీమా ఇవ్వటమే కాదు.. కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పటమే కాదు.. పెద్దన్నలా మా రక్ష మీకు ఉంటుందని బోడి మాటలు చెప్పిన కమలనాథులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గుండు సున్నా (ఏమీ చేయలేదని కాదు మాటల్లో చెప్పినంత భారీగా) చూపించటం తెలిసిందే.

తాజాగా రాజమహేంద్రవరంలో ఆదివారం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీకి మోడీ సర్కారు ఏం చేసిందో చెప్పుకునే ప్రయత్నం చేసిన ఆ పార్టీ చీఫ్ అమిత్ షా.. తాను మాటల్లో చెప్పలేని లెక్కల్ని పేపర్ల ద్వారా వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు.

ఆ లెక్కల చిట్టీ చూడగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విపరీతంగా కోపం వచ్చేస్తుంది. మీడియా మీద ఆగ్రహం వచ్చేస్తుంది. అన్ని పనులు చేసిన తర్వాత కూడా బీజేపీ ఏమీ చేయలేదని ఎలా అంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేయాలనిపిస్తుంది. మోడీ సర్కారు కాబట్టి.. ఏపీకి ఇన్ని చేసిందేనని.. ఆ భారీ జాబితాను చూసిన వెంటనే అనిపించక మానదు. సర్లేనని.. ఆ జాబితాను కాస్తంత ఓపిగ్గా చూసే ప్రయత్నం చేస్తే మాత్రం ఒళ్లు మండుతుంది.

ఏపీ ప్రజలు ఏమైనా పిచ్చ సన్నాసులా? అన్న సందేహం కలగక మానదు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఏపీ ప్రజలు వెర్రిబాగులోళ్లుగా కనిపిస్తున్నారా? అన్న భావన కలగటం ఖాయం. ఎందుకంటే..  కాగితాలు మీద అక్షరాల్ని కుమ్మరించేసి ఎంతో చేసినట్లు చెబుతున్న ఆ లెక్కల్లో కొన్ని లెక్కల్ని శాంపిల్ గా చూస్తే.. విశాఖను వణికించిన హుదూద్ తుఫానుకు ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించిన సాయం రూ.వెయ్యి కోట్లు. ఇది కాకుండా మరెంత అయినా ఇవ్వటానికి రెఢీ అని ప్రకటించారు.

కానీ.. తాజా లెక్కలు చూస్తే అందులో రూ.500 కోట్లు మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటి పిచ్చి లెక్కలు చాలానే కనిపిస్తాయి. అనంతపురంలో మిస్సైల్ ప్రాజెక్టు ప్రతిపాదన కూడా చేసేసిన లెక్కలో చూపించేశారు. చివరకు రాజమహేంద్రవరంలో రాత్రివేళ విమానాలు దిగే సౌకర్యం కూడా ఏపీకి చేసిన మా గొప్ప పనులుగా కీర్తించేశారు. అంతేకాదు.. ఢిల్లీకి వేసిన ఏపీ ఎక్స్ ప్రెస్ రైలు కూడా ఏపీని ఉద్దరించేసిన పనుల్లో ఒకటిగా కీర్తించేశారు. చివరకు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల ఎంపిక కూడా ఏపీకి ఘనంగా చేసేసిన లెక్కల్లోకి చెప్పేయటం విశేషం. ఇదిలా ఉంటే.. ఏపీకి ప్రయోజనం కలిగే విశాఖ జోన్ ను మాట వరసకు ప్రస్తావించలేదు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి గొంతు విప్పలేదు. ఏపీ రాజధానికి భారీ ప్యాకేజీ మాట రాలేదు. కానీ.. రోజు వారీగా.. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా చేసే పనుల గురించి కూడా మా గొప్పలు చెప్పుకున్న వైనం అమిత్ షా పేరిట విడుదల చేసిన ప్రకటనలో కనిపిస్తుంది. ఏపీకి ఎంతో చేశామని చెప్పుకునే పనిలో మిగిలినవి ఏమైనా ఉన్నాయంటే.. పప్పు బెల్లాల లెక్కలు మాత్రమే.

ఏపీకి చాలా చేశామని చెప్పుకునేందుకు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు అయిన ఖర్చు లెక్కల్ని చెప్పాల్సి ఉంటుంది. ఇక.. మిస్ అయిన వాటిల్లో అత్యంత ప్రముఖమైనవి.. అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీ రెండు చెంబుల్లో తెచ్చిన పార్లమెంటు మట్టి.. పవిత్ర జలాల లెక్కతో పాటు.. ఆ చెంబుల కోసం ఖర్చు పెట్టిన లెక్క కూడా మిస్ అయ్యింది. ఈసారి విడుదల చేసే జాబితాలో ఆ లెక్కలు కూడా చూపిస్తే బాగుంటుందేమోనన్న భావన కలగటం ఖాయం.
Tags:    

Similar News