క‌స‌బ్ లాంటి బుద్దే ఆ మూడు పార్టీల‌ది

Update: 2017-02-23 06:12 GMT
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం ముదురుతున్న కొద్దీ వ్యక్తిగత విమర్శలూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. 'స్కామ్' అంటే సమాజ్‌ వాది - కాంగ్రెస్ - అఖిలేష్ - మాయవతి అంటూ మోడీ నిర్వచనం చెప్పడం - అఖిలేష్ ఇందుకు ధీటుగా మోదీ చెప్పిన 'స్కామ్'కు కొత్త అర్థంగా 'సేవ్ కంట్రీ ఫ్రమ్ అమిత్‌ షా అండ్ మోదీ' అని అనడం - 'గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయవద్దు' అంటూ ప్రతిదాడికి దిగడం ఇటీవల చోటుచేసుకున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సైతం  గోరఖ్‌ పూర్‌ లోని చౌరీ చౌరలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కొత్త పల్లవి అందుకున్నారు. యూపీలోని విపక్షాలను నవంబర్ 26 దాడి నిందితుడు 'కసబ్'తో పోల్చి విసుర్లు విసిరారు. 'కసబ్ అంటే కాంగ్రెస్ - సమాజ్‌ వాది - బీఎస్‌ పీ' అని అభివర్ణించారు. కసబ్‌ లు ఇక్కడున్నంత కాలం రాష్ట్రం (యూపీ) ప్రగతి సాధించడం కల్ల' అంటూ అమిత్‌ షా విరుచుకుపడ్డారు. ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజలకు కసబ్‌ ల నుంచి విముక్తి కలుగుతుందని జోస్యం చెప్పారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌ లో ఒక వేళ ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాని పక్షంలో బీఎస్పీతో కానీ, మరే పార్టీతో కానీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని అమిత్ షా స్పష్టం చేశారు. పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగానే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని ఆయన చెప్పారు. ‘కిసీసే హాత్ మిలానేకా దూర్ దూర్‌ తక్ కోరుూ సవాల్ నహీ ఉతాతా(ఏ పార్టీతోనూ చేతులు కలిపే ప్రశ్న ఇప్పటివరకు రాలేదు) అని పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఒక వేళ యుపిలో మీ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో బిఎస్పీ లేదా మరే ఇతర పార్టీతోనైనా చేతులు కలుపుతారా అన్న ప్రశ్నకు సమాధానంగా అమిత్ షా చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ లో మూడు ప్రధాన పార్టీలయిన సమాజ్‌ వాది పార్టీ - బిఎస్పీ - బిజెపిలకు బలమైన సామాజిక బేస్‌ లు ఉన్నందున రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని కొన్ని ఎన్నికల సర్వేలు - రాజకీయ విశ్లేషకులు అంచనా వేసిన నేపథ్యంలో అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

2019 లోక్‌ సభ ఎన్నికలకు యుపి ఎన్నికల ఫలితాలు చాలా ముఖ్యమైనవని రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేసిన అమిత్‌ షా అంగీకరించారు. అయితే దేశాభివృద్ధికి ఈ ఎన్నికలు ఇంకా కీలకమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యుపిలోని మొత్తం 80 లోక్‌ సభ స్థానాల్లో 71 స్థానాలను బిజెపి గెలుచుకున్న విషయం తెలిసిందే. అప్పుడు ఈ ఫలితాలు రావడానికి అమిత్‌షా కృషి కూడా ఎంతో ఉంది. ఇప్పుడు ఓ వైపు ఎస్పీ- కాంగ్రెస్ కూటమి, మరో వైపు మాయావతి నేతృత్వంలోని బిఎస్పీల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో నాటి ఫలితాలు పునరావృతం అయ్యేలా చూడడానికి అమిత్‌ షా నిర్విరామంగా ప్రచారం సాగిస్తున్నారు. యుపితో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు అమిత్‌ షా ఈ ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పారు. యుపి - ఉత్తరాఖండ్ - గోవా రాష్ట్రా ల్లో బిజెపి భారీ మెజారిటీతో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన షా బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ జరుగుతున్న పంజాబ్ విషయంలో మాత్రం ఎలాం టి అంచనాలు వెల్లడించడానికి నిరాకరించారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి, బిఎస్పీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో బిజెపి మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల ఇబ్బంది కాదా అని అడగ్గా, లేదని షా అన్నారు. పార్టీ వ్యూహంలో భాగంగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని చెప్పారు. పార్టీ విజయం సాధిస్తే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లేదా రాష్ట్ర నాయకులెవరినైనా ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా ఎన్నికయిన పార్టీ ఎమ్మెల్యేలు - అత్యున్నత నిర్ణాయక మండలి అయిన బిజెపి పార్లమెంటరీ బోర్డు ఈ విషయాన్ని నిర్ణయిస్తారని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ రంగు పులమడానికి ప్రయత్నిస్తున్నారన్న కాంగ్రెస్ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. నిజానికి ప్రత్యర్థి పార్టీలే బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన ఎదురుదాడి చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News