నెహ్రు త‌ప్పు చేస్తే.. ఐదేళ్ల‌లో మీరు చేసిందేమిటి షా?

Update: 2019-02-25 04:41 GMT
బ‌తికున్నోళ్ల మీద ఆరోప‌ణ‌లు చేస్తే.. వారు దానికి స‌మాధానం చెబుతారు. కానీ.. మ‌న మ‌ధ్య‌న లేని వ్య‌క్తి మీద విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అందునా దాదాపు యాభై ఏళ్ల‌కు పైనే మ‌ర‌ణించిన వ్య‌క్తిని ఉద్దేశించి విమ‌ర్శ‌లు చేయ‌టంతో ఎలాంటి లాభం ఉండ‌దు. కానీ.. ఇప్పుడు అలాంటి ప‌నే చేశారు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.

క‌శ్మీరంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో మోడీ స‌ర్కారు అనుస‌రిస్తున్న తీరును త‌ప్పు ప‌ట్టినంత‌నే చ‌రిత్ర‌లోకి వెళుతున్న అమిత్ షా. అప్పుడెప్పుడో నెహ్రు చేసిన త‌ప్పుల కార‌ణంగానే క‌శ్మీరంలో తాజా ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు గ‌తం లోతుల్లోకి వెళుతున్నారు.

మోడీ స‌ర్కారు స‌రైన రీతిలో చొర‌వ చూపి క‌శ్మీర్ లో శాంతిని నెల‌కొల్ప‌లేక‌పోవ‌టంతోనే పుల్వామా ఘ‌ట‌న చోటు చేసుకుంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై అమిత్ షా తాజాగా రియాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌ను త‌ప్పు ప‌డుతున్న వారిని ఉద్దేశిస్తూ ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అమిత్ షా విమ‌ర్శ‌లు సంధించిన వ్య‌క్తుల్లో కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఒక‌రు. తాను రాహుల్ కు ఒక విష‌యాన్ని చెప్ప‌ద‌లుచుకున్నాన‌ని.. క‌శ్మీర్ మీద ఆయ‌న లేవ‌నెత్తుతున్న ప్ర‌శ్న‌ల‌కు మీ గొప్ప తాత జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ కార‌ణంగా ఆయ‌న మండిప‌డ్డారు.

పాక్ అక్ర‌మిత క‌శ్మీర్ ను భార‌త బ‌ల‌గాలు జ‌యించ‌టానికి వెళ్లిన‌ప్పుడు ఆపింది ఎవ‌రు? అంటూ ప్ర‌శ్నిస్తూ స‌మాధానంగా నెహ్రూ అన్న విష‌యాన్ని గుర్తు చేశారు. 1947లో భార‌త్ పాక్ ల మ‌ధ్య  జ‌రిగిన యుద్ధ నేప‌థ్యాన్ని గుర్తు చేస్తూ.. త‌ప్పు ప‌ట్టిన షా.. క‌శ్మీర్ స‌మ‌స్య‌కు బీజేపీ మాత్ర‌మే శాశ్విత ప‌రిష్కారాన్ని చూప‌గ‌ల‌ద‌న్నారు. అప్పుడెప్పుడో నెహ్రూ పెద్దాయ‌న త‌ప్పు చేసి ఉంటే.. గ‌డిచిన ఐదేళ్లుగా మోడీ స‌ర్కారు ఎంత‌మేర స‌రి చేసే ప్ర‌య‌త్నం చేసిందో చెబితే బాగుండేదిగా?  నెహ్రూ చేసిన త‌ప్పుల‌కు మేమిలా స‌రి చేశామ‌న్న మాట‌లు చెప్ప‌కుంటే.. మ‌న మ‌ధ్య లేని పెద్ద మ‌నిషిని ఉద్దేశించి విమ‌ర్శ‌లు చేయ‌టం షా లాంటి స్థాయి నేత‌కు త‌గ్గ పనేనా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News