మళ్లీ మొహం మీద అనిపించుకున్న రాహుల్

Update: 2016-04-01 06:25 GMT
పస లేని విమర్శలు చేసి అడ్డంగా బుక్ అయిపోవటం ఈ మధ్య కాలంలో రాజకీయ నేతల్లో ఎక్కువైంది. తెలివితేటలు తమకే ఉన్నట్లుగా విమర్శలు చేయటం.. వాటికి ప్రతిగా ప్రత్యర్థులు ఇచ్చే కౌంటర్ తో ఉక్కిరిబిక్కిరి అయ్యే వైనం రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ కనిపిస్తోంది. కేంద్రంలో కొలువు తీరిన మోడీ సర్కారును ఇరుకున పెట్టే ఉద్దేశంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శకు బీజేపీ చీఫ్ అమిత్ షా ఇచ్చిన పంచ్ అదిరిపోయిందన్న మాట వినిపిస్తోంది.

రాహుల్ పై అమిత్ షా చేసిన విమర్శను చూసినప్పుడు.. అనవసరంగా కదిలించుకోవటం రాహుల్ కు అవసరమా అనిపించక మానదు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటివరకూ తిరుగులేని అధికారాన్ని చెలాయించిన అసోంలో పవర్ పీఠం కదులుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో కంగారు పడిన రాహుల్.. బీజేపీ మీద విమర్శల ఘాటు పెంచారు.

అసోంలో బీజేపీ గెలిస్తే పాలన అంతా ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయం నాగపూర్ నుంచి జరుగుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన అమిత్ షా యూపీఏ పదేళ్ల ఏలుబడి ఇటలీ నుంచి జరిగిందని.. కాంగ్రెస్ ను ఎన్నుకుంటే అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ చెప్పటం జోక్ గా అభివర్ణించారు. 15 ఏళ్లు రాష్ట్రంలో.. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అసోం రాష్ట్రానికి ఏం చేసిందంటూ ప్రశ్నించారు. అమిత్ షా సంధించిన ప్రశ్నకు రాహుల్ అండ్ కో ధీటుగా సమాధానం చెప్పకపోవటం గమనార్హం.
Tags:    

Similar News