ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఉత్తరప్రదేశ్‌లో ఫలితాల విడుదలకు ముందు వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌లో బీజేపీ దూసుకెళ్తుందనే విషయంలో కొందరిలో సందేహం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఫలితాల విషయానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. బీజేపీ దుమ్మురేపింది. ఈ ఫలితాలతో తెలుగుదేశం పార్టీలో కొత్త విశ్లేషణ ప్రారంభమయిందనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల తర్వాత ఇక బీజేపీ విస్తరణ ఏపీ పైనే ఉండవచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఒకసారి కర్నాటక రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీజేపీ, త్వరలో అక్కడ జరగనున్న ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని, ఇక తర్వాత మిగిలింది తమ రాష్ట్రమేనని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యవహారశైలి, దూకుడు, వ్యూహాల గురించి తెలిసినందున, ఆయన ఇక ఖాళీగా ఉండబోరనే చర్చ జరుగుతోంది. కొద్దికాలం క్రితం ఇలాంటి సానుకూల పరిస్థితి లేనప్పుడే ఏపీలో పర్యటించి పార్టీ ఎదగాలని ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తాము ఇక్కడ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, సొంతంగానే ఎదిగేందుకు అమిత్‌షా దృష్టి పెడతారని, ఆ క్రమంలో పార్టీ బలం పెంచి తమపై ఒత్తిళ్లు ఖాయంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. కాగా, ఇప్పటివరకూ రాష్ట్రంలో కింది స్థాయిలో బీజేపీ కి ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవలసి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. తాజా పరిణామాలతో ఇకపై రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం అనివార్యమని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో గవర్నర్ కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును ఆ పార్టీకి ఇచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. గతంలో రాష్ట్రంలో బీజేపీ అడగకుండానే తామే రాజ్యసభ సీటు ఇచ్చినట్లుగానే ఇప్పుడు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మరోవైపు బీజేపీ ప్రణాళికలపైనా చర్చ జరుగుతోంది. ఏపీలోని పార్లమెంటు స్థానాలపై బీజేపీ ఇప్పటినుంచే దృష్టి పెడుతున్నారన్న సమాచారం గతంలోనే వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ బీజేపీ నేతలు కొందరు సామాజిక కోణంలో పలు కారణాల వల్ల ఇచ్చే మద్దతు ఇకపై తమకు ఉండకపోవచ్చునని చెప్తున్నారు. అంతేకాదు యూపీ ఫలితాల తర్వాత మరింత బలంగా మారిన మోడీపై ప్రభుత్వపరంగా కూడా ఒత్తిడి చేసే అవకాశం కోల్పోయామని తెదేపా నేతలు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా హోదాకు బదులు ప్యాకేజీ, పోలవరం నిధులు, ఇతర పెండింగ్ ప్రాజెక్టులపై ఇక ఏమాత్రం ఒత్తిళ్లు చేసే అవకాశం లేదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వెరసి బీజేపీ గెలుపు...టీడీపీకి ఊహించని తిప్పలు తెచ్చిపెట్టినట్లే కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/