వేడి పుట్టిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న విదేశాల‌కు వెళ్తాడ‌ట‌

Update: 2016-07-03 04:32 GMT
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో వేడి పెరగగానే రాహుల్ దేశం విడిచిపెట్టి వెళ్లిపోతా డని అన్నారు. 'దేశంలో ఉష్ణోగ్రతలు పెరగగానే రాహుల్ బాబా విదేశాలకు వెళ్లిపోతాడు. అలాంటాయన‌ బీజేపీ పరిపాలన రికార్డును అడుగుతాడు' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గోరఖ్‌ పూర్ లోని బస్తీలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఎస్పీని - బీఎస్పీని మట్టికరిపించి 2017 ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాల‌ని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. రెండు పార్టీలను చెత్తబుట్టలో వేయాలని, ఆ పార్టీల వల్ల ఇప్పటి వరకు రాష్ట్రం అభివృద్ధికే నోచుకోలేదని చెప్పారు. కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎస్పీ - బీఎస్పీ నే కారణం అన్నారు. నేరస్తులు - మాఫియానే ఎస్పీ ప్రభుత్వాన్ని డామినేట్ చేస్తున్నాయని ఆరోపించారు.

'ఎస్పీ - బీఎస్పీలకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయ పార్టీ బిజెపి మాత్రమే’ అన్నారు. గత లోక్‌ సభ ఎన్నికల్లో ఎన్టీయేకు అత్యధిక మెజార్జీ ఇచ్చిన క్రెడిట్ ఉత్తరప్రదేశ్‌ కే దక్కుతుందంటూ - అవే ఫలితాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ‘పార్టీ శ్రేణులు కొంచెం కష్టపడితే, వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం’ అన్నారు. ‘ఎస్పీ - బిఎస్పీలకు పదిహేనేళ్లు వంతులవారీ అధికార అవకాశం కల్పించారు. ఇప్పుడు బీజేపీకి ఒక్క చాన్స్ ఇచ్చిచూడండి’ అంటూ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘వచ్చే ఎన్నికల నాటికి బీఎస్పీలో మాయవతి ఒక్కరే మిగులుతారు’ అంటూ బీఎస్పీని వీడిపోతున్న నాయకులను ప్రస్తావిస్తూ చలోక్తి విసిరారు. ‘అధికారం ఇచ్చినందుకు అఖిలేష్ ప్రభుత్వం ఏం సాధించింది? అవినీతి - దారితప్పిన లా అండ్ ఆర్డర్ తప్ప’ అంటూ ఎస్పీ సర్కారుపై షా విమర్శలు గుప్పించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్టీయే ప్రభుత్వం చేపట్టిన ప్రజోపయోగ పథకాలు ప్రజలకు చేరకుండా ఎస్పీ ప్రభుత్వం అడ్డుపడుతోందని దుమ్మెత్తిపోశారు. ‘అఖిలేష్ ప్రభుత్వానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదలకు భూములు పంచడం మానేసి - గూండాగిరి పంచుతోంది. పోలీసులనే రక్షించుకోలేని ప్రభుత్వం - సామాన్యులకు ఎలాంటి రక్షణ కల్పించగలదో ప్రజలే ఆలోచిచాలి’ అంటూ 29మంది మృతికి కారణమైన జవహర్ బాగ్ ఘర్షణలను అమిత్ షా ప్రస్తావించారు.
Tags:    

Similar News