అమిత్ షాతో జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ.. అస‌లు కార‌ణం అదేనా!?

Update: 2022-08-21 08:19 GMT
తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ అప్పుడే రాజ‌కీయాలు వేడెక్కాయి. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి రాజీనామా త‌ర్వాత ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మునుగోడులో ఆగ‌స్టు 20న శ‌నివారం తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించి స‌మ‌ర శంఖం పూరించారు. ఇక ఇప్పుడు బీజేపీ వంతు వ‌చ్చింది. బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆగ‌స్టు 21 ఆదివారం మునుగోడులో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

కాగా అమిత్ షా స‌భ ముగిశాక మునుగోడు నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో హైద‌రాబాద్‌కు వెళ్లి అక్క‌డ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లో మార్పులు చోటు చేసుకున్నాయ‌ని తెలుస్తోంది. మునుగోడులో స‌భ ముగిశాక అమిత్ షా రోడ్డు మార్గం ద్వారా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుంటార‌ని సమాచారం. అక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు మీడియా మ‌ద్ద‌తు అందించాల్సిందిగా రామోజీని కోర‌తార‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్.. అమిత్ షాతో భేటీ కాబోతున్నార‌నే వార్త హాట్ టాపిక్ గా మారింది. అమిత్ షా ఆర్ఆర్ఆర్ సినిమా చూశార‌ని.. అందులో జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌ట‌న‌కు ఆయ‌న ఫిదా అయ్యార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను రామోజీ ఫిల్మ్ సిటీకి పిలిపించి అభినందించ‌నున్నార‌ని అంటున్నారు.

మ‌రోవైపు జూనియ‌ర్ ఎన్టీఆర్ అగ్ర హీరోల్లో ఒకడిగా ఎదిగిన‌ప్ప‌టికీ నంద‌మూరి కుటుంబం ఇప్పటికీ అత‌డిని వేరుగానే చూస్తుంద‌న్న‌ది చేదు నిజ‌మ‌ని చెబుతున్నారు. ఇక టీడీపీలో చంద్ర‌బాబు, ఆయ‌న త‌ర్వాత నారా లోకేష్ మాత్ర‌మే అన్న‌ట్టు ఉంద‌ని గుర్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను బీజేపీలోకి ఆహ్వానిస్తారా అనే చ‌ర్చ కూడా సాగుతోంది. అందులోనూ బీజేపీ ఇటీవ‌ల సినీ రంగానికి చెందిన‌వారికి పెద్ద పీట వేస్తోంది. ఇప్ప‌టికే విజ‌య‌శాంతి బీజేపీలోనే ఉన్నారు. ఏపీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. అలాగే కేర‌ళ నుంచి సురేష్ గోపీని రాజ్య‌స‌భ‌కు పంపింది. అదేవిధంగా త‌మిళ‌నాడులో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజాను, తెలంగాణ నుంచి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసింద‌ని గుర్తు చేస్తున్నారు.

అలాగే త‌మిళ‌నాడులో ప్ర‌ముఖ హీరో ర‌జినీకాంత్‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇస్తార‌ని.. మ‌రో ప్ర‌ముఖ హీరోయిన్ త్రిష‌ను బీజేపీలోకి లాగ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు. ఇక ఏపీలో మెగాస్టార్ చిరంజీవిపై బీజేపీకి ఎప్ప‌టి నుంచో క‌ళ్లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల భీమ‌వ‌రంలో ప్ర‌ధాని మోడీ.. చిరంజీవిపై ప్ర‌త్యేక అభిమానం చూప‌డం ఇందులో భాగ‌మేన‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ఎన్టీఆర్.. అమిత్ షా భేటీ కూడా స‌ర్వ‌త్రా ఆస‌క్తికి కార‌ణ‌మ‌వుతోంది. నిజంగా ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ న‌ట‌న న‌చ్చి అభినందించ‌డానికే అమిత్ షా పిలిపిస్తున్నార‌నడం ఎందుకో న‌మ్మ‌శ‌క్యంగా లేదంటున్నారు. తెర వెనుక ఏదో జరుగుతోంద‌ని విశ్లేష‌కులు అనుమానిస్తున్నారు.

అమిత్‌ షా పర్యటనలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హోం మంత్రి అమిత్‌ షాతో నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ కానున్నారు. అమిత్‌ షా ఆహ్వానం మేరకు ఎన్టీఆర్‌ 15 నిమిషాల పాటు సమావేశం అవనున్నారు. కాగా, అమిత్ షా ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూశారని.. సినిమాలో ఎన్టీఆర్‌ నటనకు మెచ్చుకుని ఆహ్వానించినట్టు సమాచారం.
Tags:    

Similar News