అమిత్‌ షాకు డిఫెన్స్? లేదా సమాచారం?

Update: 2017-08-10 16:26 GMT
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే పదవి నుంచి రాజ్యసభ సభ్యుడి హోదాకు వచ్చారు. గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీ అయిన ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చేశారు. ఇదే క్రమంలో ఆయన- త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కేబినెట్ పదవి దక్కించుకునే అవకాశం ఉన్నదని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే మోడీకి ఎంతో కీలకం అయిన అమిత్ షాకు .. ప్రభుత్వ నిర్వహణలో కీలకమైన రక్షణ శాఖ, లేదా సమాచార ప్రసార శాఖను అప్పగించవచ్చునని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కేంద్రంలో రక్షణ శాఖ చాలా కీలకమైనది. పైగా పొరుగుదేశాలతో పరిస్థితులు సవ్యంగా లేనప్పుడు.. ఈ శాఖ కుండే ప్రయారిటీ ఇంకా చాలా ఎక్కువ. అందువల్లనే మోడీ తొలిసారిగా గద్దె ఎక్కినప్పుడే గోవా లో ఉన్న మనోహర్ పారికర్ ను పనిగట్టుకుని రాజీనామా చేయించి.. ఢిల్లీ సర్కార్లోకి తీసుకున్నారు. కానీ తర్వాతి పరిణామాల్లో గోవాలో తమ సర్కారును నిలబెట్టాలంటే పారికర్ ను విధిగా అక్కడికే పంపాల్సి వచ్చింది. అప్పటినుంచి రక్షణశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేరు. అరుణ్ జైట్లీనే ప్రస్తుతం ఆ బాధ్యత చూస్తున్నారు. కానీ జైట్లీని ఆర్థిక శాఖ నుంచి తప్పించి.. పూర్తిగా డిఫెన్స్ కు పరిమితం చేయకపోవచ్చునని పలువురి అంచనా. అందుకే డిఫెన్స్ శాఖకు అమిత్ కు అప్పగించే ఛాన్సుందని అనుకుంటున్నారు.

అలాగే సమాచార ప్రసార శాఖ కూడా చాలా కీలకం. మొన్నటిదాకా వెంకయ్యనాయుడు చాలా సమర్థంగా దానిని నిర్వహించారు. ఆయన ఉపరాష్ట్రపతి అయ్యాక స్మృతి ఇరానీ ప్రస్తుతం ఆ శాఖ చూస్తున్నారు. నిజానికి ప్రభుత్వానికి అనుకూల ప్రచారం రాబట్టడంలో ఇది కూడా చాలా కీలకమైనది. అందుకని ఆ కాంబినేషన్ కూడా దక్కవచ్చునని అనుకుంటున్నారు.

మామూలుగా అయితే భాజపాలో ఒక నియమం ఉంది. ఒక నేతకు ఒకే పదవి అనేసూత్రాన్ని వారు చెబుతూ ఉంటారు. కానీ అమిత్ షా కోసం భాజపా రాజ్యాంగంలోని అనేక సూత్రాలను ఇప్పటికే మోడీ తుంగలో తొక్కేయడం జరిగింది. అలాగే అధ్యక్షపదవితో పాటూ కేబినెట్ మంత్రి పదవిని కూడా అమిత్ కు అప్పగించేస్తారని అంతా అనుకుంటున్నారు.
Tags:    

Similar News