అమిత్ షా కాన్ఫిడెన్స్ హ‌ద్దులు దాటుతుందా?

Update: 2018-03-19 05:36 GMT
చేతిలో ప‌వ‌ర్ ఉన్న‌ప్పుడు వాస్త‌వాలు అస్స‌లు క‌నిపించ‌వు. ఇదే విజేత‌ను ప‌రాజిత‌గా మారుస్తుంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా మాట‌లు చూస్తే.. ఆయ‌న‌లో కాన్ఫిడెన్స్ స్థానే ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎంత‌లా పెరిగింద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మైపోతుంది. వరుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న బీజేపీకి విజ‌యాల‌కు చెక్ పెడుతూ యూపీలో వెల్ల‌డైన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే.

బీజేపీకి కంచుకోట లాంటి స్థానాన్ని ఆ పార్టీ చేజార్చుకున్న వైనాన్ని దేశం యావ‌త్తు కీల‌క ప‌రిణామంగా ప‌రిగ‌ణిస్తే.. అమిత్ షా మాత్రం చాలా సింఫుల్ గా తేల్చే పారేయ‌టం చూస్తే.. ఆయ‌న‌లో విశ్వాస‌పుపాళ్లు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్న వైనం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

జీ ఇండియా కాంక్లేవ్ జ‌రుగుతోంది. దీనికి హాజ‌రైన అమిత్ షా.. త‌మ విజ‌యానికి సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2014లో కంటే 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తాము ఎక్కువ స్థానాల్ని సొంతం చేసుకుంటామ‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు. అంతేనా.. 2019 మాత్ర‌మే కాదు.. 2024 కూడా త‌మ‌దేన‌ని.. బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

ఏపీ ప్ర‌త్యేక హోదా అంశంపై పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెడుతున్న అవిశ్వాస తీర్మానాన్ని ఆయ‌న తేలిగ్గా తీసి పారేశారు. ప్ర‌తిప‌క్షాల అవిశ్వాస తీర్మానంపై ఆయ‌న స్పందిస్తూ.. ఎన్డీయే ప్ర‌భుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉంద‌ని.. సంఖ్యాబ‌లం త‌గ్గుతుంద‌న్న భ‌యం త‌మ‌కు లేద‌న్నారు. అవిశ్వాసంపై చ‌ర్చ‌కు సిద్ధ‌మే కానీ.. ప్ర‌తిప‌క్షాలు స‌భ‌ను జ‌ర‌గ‌నివ్వ‌టం లేద‌న్నారు. అవిశ్వాస తీర్మానంలో ఓట‌మి త‌ప్ప‌ద‌ని విప‌క్షాల‌కు తెలుస‌న్నారు.

రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లు మోడీ వ‌ర్సెస్.. విపక్షాల‌ని అంద‌రూ ప‌రిగ‌ణిస్తున్న విష‌యంపై స్పందిస్తూ.. త‌మ‌ను ఎదుర్కోవ‌టానికి అన్ని పార్టీలు చేతులు క‌ల‌ప‌టం చూస్తే.. త‌మ బ‌లం ఏమిట‌న్న‌ది అర్థ‌మ‌వుతుంద‌న్నారు. గ‌తంలో ఇందిరా వ‌ర్సెస్ మిగిలిన పార్టీల‌ని అనేవార‌ని.. ఇప్పుడుప‌రిస్థితి మారి.. మోడీ వ‌ర్సెస్ మిగిలిన పార్టీలుగా మారింద‌న్నారు.

యూపీలో బీజేపీ ఓట‌మిని ఆయ‌న తేలిగ్గా తీసిపారేశారు. అదేస‌మ‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో పార్టీ మ‌రింత వృద్ధి చెందుతోంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం. యూపీలో రాజ‌కీయ ఉనికి సంక్షోభంతో ఎస్పీ.. బీఎస్పీ రెండు పార్టీలు చేతులు క‌లిపాయ‌న్నారు. కాంగ్రెస్ నుంచి తాము 11 రాష్ట్రాల్ని కైవ‌శం చేసుకున్నామ‌ని.. తాము కొన్ని ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి చెంద‌గానే విప‌క్షాలు త‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నాయ‌న్నారు. ఓప‌క్క మోడీ వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరుగుతుంద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌లు.. మీడియా సంస్థ‌లు గుర్తిస్తున్నా.. అమిత్ షా మాత్రం అదేమీ లేదంటూ తేలిగ్గా కొట్టిపారేయ‌టం గ‌మ‌నార్హం. అమిత్ షా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కు మోడీ అండ్ కో భారీ మూల్యాన్ని చెల్లించుకోవ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News