బాబు వెళ్లిపోతే.. ఆయ‌న మాకొచ్చారు

Update: 2018-07-13 10:18 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో ఉన్న బంధంతెగిన వైనంపై బీజేపీ ఏ మాత్రం ఫీల్ కావ‌టం లేదన్న మాట తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట‌ల్ని వింటే ఇట్టే అర్థ‌మైపోతుంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూట‌మి నుంచి బ‌య‌ట‌కు పోతే.. బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ కూట‌మిలోకి వ‌చ్చిన‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.

బిహార్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే.. బాబు గుడ్ బై చెప్ప‌టం వ‌ల్ల బీజేపీకి జ‌రిగిన న‌ష్టం కించిత్ లేద‌న్న భావ‌న‌ను వ్య‌క్తం చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. కాంగ్రెస్ పార్టీతో క‌లిసి ప్రాంతీయ పార్టీల‌న్నీ కూట‌మిగా ఏర్ప‌డేందుకే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న వేళ‌.. దానిపై వ్యాఖ్యానించిన అమిత్ షా.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆ పార్టీల‌న్నింటిని తాము ఓడించిన వైనాన్ని గుర్తు చేశారు.

నిజ‌మే.. ఒక్కొక్క పార్టీగా ఓడించ‌టం ఒక ఎత్తు.. కూట‌మిగా ఏర్ప‌డిన త‌ర్వాత ఓడించ‌టం మ‌రో ఎత్తు అన్న విష‌యాన్ని అమిత్ షా ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం విశేషం. రానున్న రోజుల్లో ఎన్డీయే మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌న్న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య అమిత్ షా నోటి నుంచి వ‌చ్చింది. ఎన్డీయే నుంచి టీడీపీ వెళ్లిపోతే జేడీయూ వ‌చ్చింద‌ని..బాబు వెళ్లిపోవ‌టం వ‌ల్ల ఎన్డీయేకు జ‌రిగిన న‌ష్టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్న అమిత్ షా వైఖ‌రి చూస్తే.. బాబు తో క‌టీఫ్ త‌మ‌కు ఎలాంటి ఎఫెక్ట్ లేద‌న్న విష‌యాన్ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News