బీజేపీకి తలనొప్పి : కండోమ్ కామెంట్

Update: 2016-02-25 04:42 GMT
చేతిలో అధికారం ఉన్నప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందే. లేకుంటే చిన్న చిన్న మాటలు కూడా చికాకు పెట్టేస్తుంటాయి. కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరిన నాటి నుంచి ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తున్న బీజేపీ నేతల నోటి మాట కారణంగా ఇప్పటికే పలు తలనొప్పులు తెచ్చి పెట్టుకున్న పరిస్థితి. వేలాది కోట్ల రూపాయిల కుంభకోణాల కంటే కూడా.. నోటి మాట చేస్తున్న నష్టం ఎంతన్నది మోడీ సర్కారును చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

గడిచిన కొద్ది రోజులుగా కమలనాథుల నోటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు రాకుండా చేయటంలో బీజేపీ అధినాయకత్వం సక్సెస్ అవుతుందన్న మాట వినిపిస్తున్న సమయంలోనే రాజస్థాన్ కు చెందిన ఒక ఎమ్మెల్యే నోటి తీట తాజా తలనొప్పులు తెచ్చి పెడుతున్న పరిస్థితి. విశ్వవిద్యాలయాల్లో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో విపక్షాల ఎదురుదాడితో మోడీ సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీ జేఎన్ యూ విశ్వవిద్యాలయం మీద అహుజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలకు ప్రచారం లభించే లోపే.. అలెర్ట్ అయిన బీజేపీ అధినాయకత్వం అహుజాకు నోటీసులు ఇచ్చారు. అహుజా చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.

ఇంతకీ అహుజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏమిటన్న విషయాన్ని చూస్తే.. ‘‘రోజూ 2వేల దేశీ.. విదేశీ లిక్కర్ బాటిల్స్.. 50వేల ఎముకలు.. 3వేల కండోమ్ లు.. 500 అబార్షన్ ఇంజెక్షన్లు కనిపిస్తాయి. ఇవి కాకుండా 10వేల సిగిరెట్ పీకలు.. 2 వేల వాడేసిన చిప్స్ ప్యాకెట్ రేపర్లు వర్సిటీ క్యాంపస్ లో కనిపిస్తాయి’’ అంటూ జేఎన్ యూ వర్సిటీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు విశ్వవిద్యాలయ విద్యార్థుల భావోద్వేగాల్ని టచ్ చేయటంతో పాటు.. పార్టీకి మరింత డ్యామేజింగ్ గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ అధినాయకత్వం.. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ అహుజాను ఆదేశించింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో తమ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తమకెక్కడ కొత్త తలనొప్పులు తెచ్చి పెడతాయోనన్న భయం కమలనాథుల్లో కనిపిస్తోంది.
Tags:    

Similar News