రామోజీ ఇంటికి అమిత్‌ షా..ఏం జ‌ర‌గ‌బోతోంది?

Update: 2018-07-13 07:12 GMT
ఓ వైపు ముంద‌స్తు ఎన్నిక‌ల వాతావర‌ణం రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తుంటే...కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ త‌మ స‌త్తాను చాటుకునేందుకు ప‌లు రాష్ర్టాల‌పై పెద్ద ఎత్తున రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను అమ‌లు చేస్తుంద‌నే ప్రచారం జ‌రుగుతున్న స‌మ‌యంలో తెలుగు రాష్ర్టాల్లో కీల‌క‌మైన ప‌రిణామం చోటు చేసుకుంటోంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ న‌మ్మిన‌బంటు అయిన అమిత్ షా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు రావ‌డం ఇందులో ఒకటి కాగా మీడియా మొఘ‌ల్ రామోజీరావుతో భేటీ అవ‌డం మ‌రో అంశం.

హైద‌రాబాద్‌ కు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమిత్‌ షా ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యే షెడ్యూల్ పెట్టుకున్నారు. 2019 ఎన్నిక‌లు - ముంద‌స్తు ప్ర‌చారం నేప‌థ్యంలో పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి - ప్ర‌జ‌ల్లోకి ఎలా చేరువ కావాల‌నేది ఈ సంద‌ర్భంగా అమిత్ షా వివ‌రించ‌నున్నారు. ఉద‌యం 12 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు సాగే ఈ స‌మావేశం అనంత‌రం ఆయ‌న నేరుగా మీడియా మొఘ‌ల్ - రామోజీ గ్రూపు అధినేత రామోజీరావును క‌లిసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అదికూడా స్వ‌యంగా రామోజీ నివ‌సిస్తున్న ఫిలింసిటీలోని ఆయ‌న‌ ఇంటికి వెళ్లి భేటీ అయ్యేలా అమిత్‌ షా త‌న షెడ్యూల్‌ ను ఏర్పాటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఫిలింసిటీలో వీరిద్ద‌రి మ‌ధ్య దాదాపు గంట పాటు స‌మావేశం జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. ఎన్డీఏ సార‌థ్యంలోని బీజేపీ స‌ర్కారు నాలుగేళ్ల పాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న`సంప‌ర్క్ ఫ‌ర్ స‌మ‌ర్థ‌న్‌` ప్ర‌చార ప‌ర్వంలో భాగంగా ఈ భేటీ జ‌ర‌గ‌నుంది.

కాగా, రామోజీతో అమిత్ షా స‌మావేశం అవ‌డం అనేక చ‌ర్చ‌ల‌కు బీజం వేస్తోంది. ఎన్డీఏతో టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు పొత్తు తెంచుకోవ‌డం - అనంత‌రం ఇటు ప్ర‌ధాని మోడీపై అటు బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌ షాపై ఆయ‌న మండిప‌డుతుండ‌టం తెలిసిన సంగ‌తే. ఇదే స‌మ‌యంలో బీజేపీ పట్ల త‌న మీడియాలో సానుకూల దోర‌ణితో రామోజీరావు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ ఉంది. ఈ నేప‌థ్యంలో రామోజీ ఇంటికి వెళ్లి మ‌రీ అమిత్‌ షాతో స‌మావేశం అవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పేరుకు `సంప‌ర్క్ ఫ‌ర్ స‌మ‌ర్థ‌న్‌` కార్య‌క్ర‌మం అయిన‌ప్ప‌టికీ ఈ స‌మావేశంలో ఖ‌చ్చితంగా రాజ‌కీయాలు చ‌ర్చకు వస్తాయంటున్నారు. కాగా, ఈ ప‌ర్య‌ట‌న‌లోనే బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ - ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త శ్రీ‌నిరాజును కూడా అమిత్‌ షా క‌ల‌వ‌నున్నారు.
Tags:    

Similar News