కీల‌క ప‌ద‌విని వ‌దులుకోనున్న అమిత్ షా..!

Update: 2019-10-16 13:40 GMT
బీజేపీ జాతీయ సార‌థి -కేంద్ర హోం శాఖ మంత్రి - ప్ర‌ధాని నరేంద్ర మోడీకి అత్యంత ఆప్తుడు అమిత్ షా.. త్వ‌ర‌లోనే కీల‌క ప‌ద‌విని ఒక‌దానిని వ‌దులుకోనున్నారా?  ప్ర‌స్తుతం అటు కేంద్ర హోం శాఖ‌ను - ఇటు బీజేపీ సార‌ధ్యాన్ని కూడా చూస్తున్న ఆయ‌న గ‌డిచిన నాలుగు నెల‌లుగా ఈ రెండు ప‌ద‌వుల‌ను స‌మ ఉజ్జీగా లాక్కొస్తున్నారు. నిజానికి ఏ పార్టీలోనూ ఇలా జోడు ప‌ద‌వులు ఉన్న నేత‌లు చాలా అరుదుగా ఉంటారు. అస‌లు ఉండ‌క‌నూ పోవ‌చ్చు. గ‌తంలో ప్ర‌ధానిగా ఉన్న ఇందిరాగాంధీ.. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా వ్య‌వ‌హ‌రించారు. అయితే, ఆమెపై పార్టీలోనే కొంత సెగ‌రావ‌డంతో దానిని వ‌దులుకున్నారు.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇలా ఇటు పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను కేంద్ర మంత్రి అందునా కీల‌క‌మైన హోంశాఖ‌ను ఏక‌కాలంలో నిర్వ‌హించ‌డం పై పైకి ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌క‌పోయినా.. షాపై ఒత్తిడి మాత్రం పెరుగుతోంద‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏరికోరి ఆయ‌న‌ను బీజేపీ అధ్య‌క్షుడిగా చేశారు. అదే స‌మ‌యంలో ఆయ‌న‌ను కేంద్ర హోం శాఖ‌లోకి తీసుకున్నారు. గ‌తంలో గుజ‌రాత్ సీఎంగా మోడీ ఉన్న స‌మ‌యంలోనూ షా రాష్ట్ర హోం శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. ఈ ద్వ‌యం ఇప్పుడు ఇదే విధంగా దేశంలోనే కీల‌క‌మైన ప‌ద‌వుల్లో ఉంటూ.. పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాల‌ను కూడా నిర్వ‌హిస్తోంది. దీనిని ప్ర‌శ్నించే వారు లేకపోవ‌డం గ‌మ‌నార్హం.

జూనియ‌ర్లు ఎలాగూ.. ఈ ప‌రిణామాన్ని ప్ర‌శ్నించే ప‌రిస్థితి లేదు. అలాగ‌ని సీనియ‌ర్లు కూడా మారు మాట్లాడ‌డం లేదు. అయితే, తాజాగా కేంద్రంలోని మ‌రో మంత్రి రాజ్‌నాథ్ మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నార‌ని స‌మాచారం. తొలి ఐదేళ్ల పాల‌న‌లో కేంద్ర హోం ప‌గ్గాల‌ను ఈయ‌నే చూశారు. అయితే, ఇప్పుడు మాత్రం ఈయ‌న‌ను ర‌క్ష‌ణ శాఖ‌కు ప‌రిమితం చేయ‌డంపై ఆయ‌న గుస్సాగా ఉన్నారు. ఇక‌, పార్టీలో 75 ఏళ్లు పైబ‌డిన వారు మాత్రం షా ఇలా జోడు ప‌ద‌వులు అనుభ‌వించ‌డంపై కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అయిన‌ప్ప‌టికీ.. ఎవ‌రూ నోరు విప్ప‌డం, ప్ర‌శ్నించ‌డం అనేది చేసేందుకు ధైర్యంలేదు. ఇప్పుడే కాదు, వ‌చ్చే ఐదేళ్ల‌పాటు షా ఈ రెండు ప‌ద‌వులు అనుభ‌వించినా.. ఎవ‌రూ మాట్లాడే ప‌రిస్థితి లేదు.

అయితే, తాజాగా బీజేపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.,. త్వ‌ర‌లోనే షా.. బీజేపీ అధ్య‌క్ష ప‌గ్గాల‌ను ప‌క్క‌న పెట్టేందుకు సిద్ధ‌ప‌డ్డార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం జాతీయ స్థాయిలో పార్టీని న‌డిపించే యోధుడి కోసం వారు అన్వేష‌ణ సాగిస్తున్నార‌ని ఢిల్లీ వ‌ర్గాలు అంటున్నాయి. ప్ర‌స్తుతం త‌న‌కు హోం శాఖ ప‌నితోనే తీరిక ఉండ‌డం లేద‌ని, వివిధ రాష్ట్రాల స‌మ‌స్య‌లు స‌హా శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు వంటివాటితో త‌న‌కు తీరిక ఉండ‌డం లేద‌ని, ఈ నేప‌థ్యంలో పార్టీని ముందుండి న‌డిపించే నాయ‌కుడు అవ‌స‌ర‌మ‌న్న‌ది షా అభిమ‌తంగా ఈ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న బీజేపీ ప‌గ్గాల‌ను మ‌రో కీల‌క నాయ‌కుడికి అప్ప‌గించ‌డం ద్వారా దేశంలో బీజేపీ జెండాను, అజెండాను మ‌రింత స‌మ‌ర్ధ‌వంతంగా విస్త‌రించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. మ‌రి ఎవ‌రికి ఈ ప‌గ్గాలుఅప్ప‌గిస్తారు? ఎప్పుడు అప్ప‌గిస్తారు? అనే విష‌యాల కోసం కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌నిఅంటున్నారు.


Tags:    

Similar News