బీజేపీ స్పీడ్ పెంచేసింది!..బాబుకు చుక్క‌లే!

Update: 2018-03-31 09:21 GMT
బీజేపీ - టీడీపీ... మొన్న‌టిదాకా మిత్ర‌ప‌క్షాలు. 2014 ఎన్నిక‌ల్లో ఇరు పార్టీలు క‌లిసే పోటీ  చేశాయి. అంతేకాకుండా ఈ పార్టీలు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌పోర్ట్ తీసుకున్నాయి. ఫ‌లితంగా ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సీఎం పీఠాన్ని ద‌క్కించేసుకున్నారు. అప్ప‌టిదాకా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైపు గాలి వీయ‌గా.. ఆ గాలిని త‌న వైపు తిప్పుకునేందుకే చంద్ర‌బాబు... బీజేపీ - ప‌వ‌న్‌ ల‌తో దోస్తీ క‌ట్టార‌న్న విశ్లేష‌ణ‌లు సాగాయి. అయితే ఈ మూడు పార్టీల మైత్రి గ‌త‌మే. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం సాగుతున్న పోరు నేప‌థ్యంలో జ‌న‌సేన యూట‌ర్న్ తీసుకుని చంద్రబాబుకు ఊహించ‌ని షాక్ ఇవ్వ‌గా... త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు బీజేపీకి గుడ్ బై చెప్ప‌క త‌ప్ప‌లేదు. వెర‌సి నిన్న‌టిదాకా మిత్ర‌ప‌క్షాలుగా సాగిన బీజేపీ - టీడీపీలు ఇప్పుడు వైరి వ‌ర్గాలైపోయాయి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌రో ఏడాదిలో అటు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రిగానే బ‌రిలోకి దిగ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. విప‌క్ష వైసీపీది కూడా ఒంట‌రి పోరే. జ‌న‌సేన‌ది ఏ వైఖ‌రి అన్న‌ది ఇప్ప‌టికిప్పుడు అంచ‌నా వేసే ప‌రిస్థితి లేదు. ఇక బీజేపీ వైఖ‌రి కూడా అస్ప‌ష్ట‌మే. ఇలాంటి నేప‌థ్యంలో ఏపీలో భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిలు సిద్ధం చేసుకునేందుకు బీజేపీ న‌డుం బిగించింద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇందుకోసం బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం త్వ‌ర‌లోనే ఏపీకి రానుంద‌ని - ఏపీ పొలిటిక‌ల్ కేపిట‌ల్ గా ఉన్న విజ‌య‌వాడ‌లో భారీ ఎత్తున మేథోమ‌థ‌నం చేయ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని గ్రామ స్థాయి కార్య‌క‌ర్త నుంచి రాష్ట్ర స్థాయి నేత‌ల దాకా భారీ సంఖ్య‌లో హాజ‌రు కానున్న ఈ స‌మావేశానికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడి హోదాలో అమిత్ షా నేతృత్వం వ‌హించ‌నున్నార‌ట‌.

ఇక అమిత్ షాతో పాటు ఏపీ వ్య‌వ‌హారాల‌పై మంచి ప‌ట్టు ఉన్న బీజేపీ సీనియ‌ర్ నేత‌లు రాం మాధ‌వ్‌ - జీవీఎల్ న‌ర‌సింహారావు స‌హా పార్టీ రాష్ట్ర శాఖ‌కు చెందిన కీల‌క నేతలంతా హాజ‌రుకానున్న‌ట్లుగా స‌మాచారం. ఈ స‌మావేశంలో పార్టీ ప‌టిష్ఠ‌త‌కు సంబంధించి స‌మగ్ర చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని - గ్రామ స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న విష‌యంపై స‌మాలోచ‌న‌లు జ‌రుగుతాయ‌ని కూడా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్తంగా ఏపీలో పార్టీని  మ‌రింత బ‌లంగా తీర్చిదిద్దే క్ర‌మంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడి మార్పు త‌ప్ప‌నిస‌రి అని అధినాయ‌క‌త్వం భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం. దీనిపై ఇప్ప‌టికే పార్టీలో జోరుగా చ‌ర్చ సాగుతున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుత అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు స్థానంలో తాజా మాజీ మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావును నియ‌మించే దిశ‌గా చ‌ర్య‌లు మొద‌లైన‌ట్లుగా స‌మాచారం. ఒక‌రిద్ద‌రు నేత‌లు దీనిపై అసంతృప్తిగా ఉన్నా... వారిని బుజ్జ‌గించేందుకు ఇప్ప‌టికే రాం మాధ‌వ్ రంగంలోకి దిగిపోయార‌ట‌. అదే స‌మ‌యంలో పార్టీకి సంబంధించిన లీగ‌ల్ సెల్ ను బ‌లోపేతం చేసే విష‌యంపై కూడా ఆ స‌మావేశంలో కీల‌కంగానే చ‌ర్చిస్తార‌ట‌. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ వైరివ‌ర్గంగా మారడం, ఆ పార్టీ ప్ర‌భుత్వంలో భారీ ఎత్తున అవినీతి సాగుతున్న‌ట్లుగా బీజేపీ నేత‌లు వ‌రుస‌గా ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో టీడీపీని ఇరుకున పెట్టేందుకు లీగ‌ల్ సెల్ ను బ‌లోపేతం చేయాల్సిందేన‌న్న దిశ‌గా బీజేపీ యోచిస్తోంద‌ట‌. మొత్తంగా ఏపీలో బీజేపీ దూకుడు పెంచేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకుంటోంద‌ని, ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు మ‌రింత ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News