సొంత వైద్యం చేసుకొని కొంప మీదకు తెచ్చుకుంటున్నారట

Update: 2020-08-02 15:30 GMT
తలనొప్పి వస్తే మందులషాపుకు వెళ్లి మందుబిళ్ల అడగటం కామన్. విదేశాల్లో ఇలాంటివి కనిపించవు. మన దేశంలో ఇలాంటి చాలా కామన్. జ్వరం.. జలుబు.. దగ్గు.. కడుపునొప్పి.. ఇలా చెప్పుకుంటూ పోతే మందులషాపు వాడికి ఆరోగ్య సమస్యలు చెప్పి అందుకు తగ్గ మందులు వాడే ధోరణి మన దగ్గర ఎక్కువే. వాస్తవానికి ఈ పద్దతి సరైనది కాదు. కానీ.. అలా అలవాటైపోయిన పరిస్థితి. ఇదే అలవాటు ప్రాణాంతక వైరస్ విషయంలోనూ చేయటమా?

విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. షాకింగ్ గా మారిన కఠిన వాస్తవంగా దీన్ని చెప్పాలి. తాజాగా ఒక మీడియా చానల్ చేసిన సర్వే రిపోర్టు షాకింగ్ గా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సోకితే..మన దేశంలోని చాలామంది తెలిసిన వారికి ఫోన్లు చేసి సొంతవైద్యాన్ని చేసుకుంటున్న వైనం వెల్లడైంది. అంతేకాదు.. కరోనా వ్యాధి వచ్చిందన్న విషయం తెలిసినంతనే.. అప్పటికే కరోనా పాజిటివ్ గా ఉన్న వారికి ఫోన్ చేయటం.. వారు వాడుతున్న మందుల్నే వాడుతున్న వైనాన్ని గుర్తించారు.

వాస్తవానికి.. ఇది చాలా అపాయకరమైన విధానంగా వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకిన ఏ ఇద్దరికి ఒకేలాంటి వైద్యం చేయరని.. ఎవరికి వారికి.. వారికున్న లక్షణాల ఆధారంగా వైద్యం చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. అందుకు భిన్నంగా సొంతవైద్యం చేస్తే.. చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహాలు.. సూచనలు తీసుకోకుండా మందులు వాడటం చాలా డేంజర్ గా వాపోతున్నారు.

సొంతవైద్యం కారణంగా కూడా కరోనా మరింతమందికి వ్యాపిస్తుందని వైద్యులువాపోతున్నారు. కరోనా పాజిటివ్ పేషెంట్ ను వైద్యులు స్వయంగా పరిశీలించి.. పరీక్ష చేసిన తర్వాత మాత్రమే.. వారికి సరిపోయే మందుల్ని చెప్పగలుగుతారని.. అంతేకానీ అవగాహన లేకుండా మందుల్ని వాడటం సరికాదని ప్రముఖ వైరాలజిస్టు అమితాబ్ నందీ స్పష్టం చేస్తున్నారు. కరోనాకు సంబంధించి మరో కీలకమైన అంశం.. కరోనా వచ్చిన దాని కంటే కూడా.. దానికి కారణమైన భయంతో ఎక్కువ చేటు చేస్తుందని చెబుతున్నారు. కరోనా బారిన పడితే.. వైద్యుల సూచనలతో మందులు వాడటం.. భయపడకుండా.. ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతున్నారు.


Tags:    

Similar News