సేనతో జరిగిన ప్రైవేటు భేటీ డిటైల్స్ బయటపెట్టిన షా

Update: 2019-11-14 06:26 GMT
బీజేపీ జాతీయ అధ్యక్షుడు కమ్ కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాకు సంబంధించి ఆసక్తికర మాటల్ని కొన్ని చెబుతుంటారు. ఆయన నోటి నుంచి ఏదైనా హామీ వచ్చినా.. మాట ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటారని.. దాని అమలు కోసం మళ్లీ మళ్లీ గుర్తు చేయాల్సిన అవసరం ఉండదని చెబుతారు. మోడీకి నీడగా చెప్పే అమిత్ షా మాట మీద నిలబడే గుణం ఎక్కువని.. అందుకే ఆయన ఆభయహస్తం ఒకసారి పొందితే ఇక తిరుగు ఉండదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

మాట విషయంలో ఆయనిచ్చే ప్రాధాన్యత ఎక్కువని చెబుతారు. అలాంటి అమిత్ షా 50-50 ఫార్ములాకు ఓకే చెప్పారని.. ఎన్నికల ముందు జరిగిన హైలెవల్ మీటింగ్ లో తమకు ఆయన ఆ హామీ ఇచ్చిన వైనాన్ని శివసేన వెల్లడించటాన్ని మర్చిపోకూడదు. మహారాష్ట్రలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై ఇప్పటివరకూ నోరు విప్పని అమిత్ షా.. తాజాగా నోరు విప్పటమే కాదు.. అసలేం జరిగిదంటే అంటూ చాలా విషయాల్నే చెప్పుకొచ్చారు.

ఎన్నికల వేళలో శివసేనతో జరిగిన సమావేశంలో 50-50 ఫార్ములా మీద చర్చ జరగలేదని.. అసలు ఆ దిశగా చర్చలు జరగలేదని తేల్చారు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారని.. మిత్రపక్షాలతో నాలుగు గోడల మధ్య జరిగిన సంభాషణల వివరాల్ని బహిర్గతం చేయటం తమ పార్టీ సంస్కారం కాదన్నారు.

మహారాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టటం వల్ల మిగిలినవారి కంటే తమకే ఎక్కువ నష్టం జరిగిందని.. తమ ప్రభుత్వం పోయిందే తప్పించి ప్రతిపక్షాలకు పోయిందేమీ లేదన్నారు. తాము మిత్రపక్షం శివసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లామని.. ఆ తర్వాత షరుతలు పెట్టటంతో తాము అందుకు సానుకూలంగా స్పందించలేదన్నారు. అందువల్లే తాము మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. అమిత్ షా మాటలు విన్నంతనే.. మహారాష్ట్ర ఎపిసోడ్ లో శివసేనను దోషి అన్న భావన కలగటం ఖాయం. మరి.. నాటి మిత్రుడి నోటి నుంచి వచ్చిన మాటల నేపథ్యంలో సేన ఏ రీతిలో స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News