తెలంగాణ‌పై గురిపెట్టిన అమిత్ షా!

Update: 2017-01-20 04:22 GMT
తెలుగు నేల‌పై ప‌టిష్ట పునాది కోసం క‌మ‌ల‌నాథులుగా పేరుగాంచిన బీజేపీ నేత‌లు చేయ‌ని య‌త్న‌మంటూ లేద‌నే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో కాస్తంత బ‌లంగానే క‌నిపిస్తున్నప్ప‌టికీ... అక్క‌డ అధికార పార్టీగా ఉన్న టీడీపీతో పొత్తు కార‌ణంగా... అక్క‌డ పార్టీ ప‌టిష్ట‌త‌పై అంత‌గా దృష్టి సారించే అవ‌కాశాలు ఆ పార్టీకి లేవ‌నే చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో టీడీపీ నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులిచ్చిన బీజేపీ... ఏపీ కేబినెట్‌ లో త‌న పార్టీ ఎమ్మెల్యేలిద్ద‌రికీ మంత్రి ప‌ద‌వుల‌ను తీసుకుంది. ఈ క్ర‌మంలో అంత‌గా స‌త్ఫ‌లితాలు చూప‌లేక‌పోతున్న తెలంగాణ‌పై ప్ర‌స్తుతం ఆ పార్టీ దృష్టి సారించింది. ఈ క్ర‌మంలో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా నేడు తెలంగాణ‌కు వ‌స్తున్నారు. భ‌ద్రాచలంలో నేడు, రేపు జ‌రిగే పార్ట రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో ఆయ‌న పాలుపంచుకోనున్నారు. తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతానికి సంబంధించి ప‌క్కా వ్యూహ ర‌చ‌న‌తోనే ఆయ‌న ఇక్క‌డికి వ‌స్తున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇప్ప‌టికే పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి హోదాలో ఆ పార్టీ సీనియ‌ర్ నేత ముళీధ‌ర్ రావు... తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతానికి బాగానే క‌ష్టప‌డుతున్నారు. నిత్యం యాక్టివ్‌ గా ఉండే ముర‌ళీధ‌ర్‌ రావు... పార్టీ శ్రేణుల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ఉత్సాహం నింపుతూనే ఉన్నార‌నే చెప్పాలి. నిత్యం జ‌నంలో ఉండే ఆయ‌న టీఆర్ఎస్ స‌ర్కారుపై వ్యూహాత్మ‌క విమ‌ర్శ‌లు చేస్తూనే... పార్టీ కార్య‌క‌లాపాల‌ను ఎక్క‌డ కూడా ఆగ‌కుండా చేయ‌గ‌లుగుతున్నారు. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో పార్టీ ప‌టిష్ట‌త‌పై దృష్టి సారించిన ముర‌ళీధ‌ర్‌రావు... రాష్ట్రంలో పార్టీ స్థితిగ‌తుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు అధిష్ఠానానికి నివేదిక‌లు పంపుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే... గ‌తంలో ఓ సారి హైద‌రాబాదు వ‌చ్చిన అమిత్ షాకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. కేవ‌లం ఒక్క‌రోజు మాత్ర‌మే ఆయ‌న హైద‌రాబాదులో ఉన్నా... పార్టీ శ్రేణులంతా హైద‌రాబాదు త‌ర‌లివచ్చి... హంగామా చేశారు.

తాజాగా మ‌రోమారు రాష్ట్రానికి వ‌స్తున్న అమిత్ షా... ఈ ద‌ఫా ఏకంగా రెండు రోజుల పాటు రాష్ట్రంలోనే తిష్ట వేయ‌నున్నారు. అంతేకాకుండా... పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాలు ఆద్యంతం ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే కొన‌సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. సాధార‌ణంగా పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాలు... ఆయా రాష్ట్రాల అధ్య‌క్షుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే కొన‌సాగుతాయి. అయితే తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌కు ఏకంగా పార్టీ జాతీయ అధ్య‌క్షుడి హోదాలో అమిత్ షా వ‌స్తుండ‌టం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రి రెండు రోజుల పాటు భ‌ద్రాచలం - హైద‌రాబాదుల్లో ఉండే అమిత్ షా... రాష్ట్రంలో పార్టీ ప‌టిష్ట‌త‌కు ఏ త‌ర‌హా ప్లాన్ ర‌చించుకుని వ‌స్తున్నార‌న్న ఆస‌క్తి నెల‌కొంది. అమిత్ షా ప్లాన్ వ‌ర్క‌వుట‌వుతుందా?  లేదా? అన్న కోణంలోనూ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News