ఐదేళ్లలో రూ.10లక్షల కోట్లు రద్దు.. మరి వీరి సిబిల్ స్కోర్ మాటేంది?

Update: 2022-08-03 04:16 GMT
పెరుగు పాకెట్ కొంటే జీఎస్టీతో సగటుజీవి నుంచి జీఎస్టీ రూపంలో పన్ను లాగేసే మోడీ సర్కారు.. ఆదాయం విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉప్పు.. పప్పు మొదలుకొని భారీ వస్తువల వరకు జీఎస్టీ బాదుడే బాదుడన్నట్లుగా మారింది. అలా చిన్నా.. పెద్ద.. ధనిక.. బీద అన్న తేడా లేకుండా అందరిని జీఎస్టీతో బాదేసి.. భారీగా ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్న మోడీ సర్కారు.. ఆ ఆదాయాన్ని దేని కోసం ఖర్చు చేస్తోందన్నది ప్రశ్న. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలాంటి వాదనను వినిపిస్తారు.

వాటిని పక్కన పెడితే.. తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారు రాజ్యసభ సభ్యుడు ఒకరు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. దీని గురించి విన్నంతనే ఒళ్లు మండిపోవటమే కాదు.. చదువుతున్న కొద్దీ చిరాకు స్థాయి అంతకంతకూ పెరిగిపోవటం ఖాయమని చెప్పాలి. ఎందుకంటే.. ఆ విషయం అలాంటిది మరి. గడిచిన ఐదేళ్లలో వివిధ సంస్థలకు చెందిన మొండి బకాయిల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయాన్ని వెల్లడించింది.

అది కూడా ఎంత భారీ మొత్తమంటే.. అక్షరాల రూ.10 లక్షల కోట్లు. నిజమా? అన్న ఆశ్చర్యం అస్సలు అక్కర్లేదు. నిజంగానే నిజం. ఆ మాటకు వస్తే.. గత ఆర్థిక సంవత్సరం అంటే 2021 ఏప్రిల్-2022 మార్చి 31 మధ్యన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.1.57 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని మొండిబకాయిల రద్దు కోసం వినియోగించినట్లుగా చెబుతున్నారు.

దానికి ఏడాది ముందు రూ.2.02 లక్షల కోట్లు.. 2019-20లో రూ.2.34 లక్షల కోట్లు.. 2018-19లో రూ.2.36 లక్షల కోట్లు మొత్తాన్ని రద్దు చేసినట్లుగా వెల్లడించారు. ఇంత భారీగామొండి బకాయిల్ని రద్దు చేసిన ప్రభుత్వ వైఖరిపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎవరో అప్పు చేయటం ఏమిటి? వారు తిరిగి చెల్లించకపోవటం ఏమిటి? దానికి విలువైన ప్రజాధనాన్ని.. అది కూడా పన్నుల రూపంలో చెల్లించిన మొత్తాన్ని మొండి బకాయిల రద్దు కోసం వినియోగించటం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న.

అంతేకాదు.. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతదారుల సంఖ్యను కూడా పార్లమెంటులో కేంద్ర మంత్రి భగవత్ కె. కరాడ్ వెల్లడించారు. గడిచిన నాలుగేళ్లలో 10చ306 మంది ఉద్దేశ పూర్వకంగా ఎగవేతకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. పన్ను ఎగవేతకు సంబంధించిన టాప్ పాతిక మంది  వివరాల్ని వెల్లడించారు. అందులో మోహుల్ ఛోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ రూ.7110 కోట్లు.. ఎరా ఇన్ ఫ్రా ఇంజనీరింగ్ రూ.5879 కోట్లు.. కన్ కాస్ట్ స్టీల్ అండ్ పవర్ రూ.4107 కోట్లు.. ఆర్ ఈఐ ఆగ్రో లిమిటెడ్ కు సంబంధించి రూ.3984 కోట్ల భారీ మొత్తం కూడా ఉన్నట్లుగా వెల్లడించారు.

బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బుల్లో కాసింత కట్టలేకపోయినా.. సిబిల్ స్కోర్ సర్వనాశనమైపోతున్నట్లుగా .. అలా చేస్తే భవిష్యత్తులో అప్పు పుట్టదంటూ భయపెట్టేస్తుంటారు. వ్యక్తిగతంగా ఇన్నేసి భయాలతో ప్రజల నుంచి పిండేసిన  ప్రభుత్వాలు.. బడా బాబుల రుణ ఎగవేతల మీద చర్యలేంది? అన్నది ప్రశ్న. వ్యక్తులకు ఎలా అయితే సిబిల్ స్కోర్ ఉంటుందో.. సంస్థలకు ఉంటుంది. కానీ.. కాస్తంత భిన్నంగా ఉంటుంది. అయినా.. ఇంత భారీ మొత్తాలు రుణాలుగా చెల్లింపులు జరపకున్నా.. రాని బాకీల కింద రద్దు చేయటం చూసినప్పుడు.. బడా బాబులకు ఉన్న సౌలభ్యాలు అన్నిఇన్ని కావని చెప్పక తప్పదు.
Tags:    

Similar News