అమెరికాలోనే పవర్ ఫుల్ మహిళ ఇంట్లోకి సుత్తితో వెళ్లి ఆమె భర్తపై దాడి

Update: 2022-10-29 04:39 GMT
అగ్రరాజ్యమైన అమెరికాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అమెరికాలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో ముందు వరుసలో ఉండే నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీపై దాడి చేసుకుంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ గా వ్యవహరిస్తున్న ఆమె ఎంతటి పవర్ ఫుల్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

డ్రాగన్ దేశం వార్నింగ్ లను సైతం పిచ్చ లైట్ తీసుకుంటూ ఆ మధ్యన తైవాన్ లో పర్యటించిన వైనం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆమె ఇంట్లో లేని వేళ.. ఆమె నివాసంలోకి గుర్తు తెలియని దుండగుడు ఒకరు ప్రవేశించి.. ఆమె భర్తపై దాడి చేసిన వైనం సంచలనంగా మారింది.

అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం వేళలో కాలిఫోర్నియాలోని ఆమె ఇంట్లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకున్నట్లుగా స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాన్సీ పెలోసీ భర్తను ఆసుపత్రికి తరలించినట్లుగా పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన ఆయనకు ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. భర్తపై దాడి జరిగిన సమయంలో ఆమె ఇంట్లో లేరు. నవంబరు 8న జరిగే మధ్యంతర ఎన్నికలకు ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు.

దాడికి పాల్పడిన దుండగుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఇంట్లోకి వెళ్లిన సమయంలో అతడి చేతిలో సుత్తి ఉందని.. అయితే.. దాడి సమయంలో సుత్తిని వినియోగించాడా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటన్నది బయటకు రావాల్సి ఉంది. ఇక.. నాన్సీ భర్త విషయానికి వస్తే.. ఆయన కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన వారు. ప్రముఖ వ్యాపారవేత్త. వారిద్దరికి 1963లో పెళ్లైంది. ఈ జంటకు ఐదుగురు సంతానం కాగా.. కాంగ్రెస్ సభ్యుల్లో నాన్సీ పెలోసీ అత్యంత సంపన్నురాలిగా నిలవటం విశేషం.

అమెరికాలో పవర్ ఫుల్ మహిళగా పేరున్న ఆమె.. ప్రతినిధుల సభకు నాలుగోసారి ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక 2021లో జరిగింది. గడిచిన పాతికేళ్లలో తైవాన్ ను సందర్శించిన అమెరికాకు చెందిన కీలక నేత ఆమెనే. తైవాన్ పర్యటన సందర్భంగా ఆమెకు బోలెడన్ని హెచ్చరికలు వచ్చినా.. వాటిని పట్టించుకోకుండా మొండి పట్టుదలతో ఆమె ఆ దేశంలో పర్యటించటంపై చైనా గుర్రుగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె భర్తపై దాడికి పాల్పడిన ఉదంతంపై పోలీసులు సీరియస్ గా తీసుకొని విచారణ జరుపుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News