ఆనం వ‌ర్సెస్ క‌న్న‌బాబు..రోడ్డున ప‌డ్డారే!

Update: 2017-11-30 07:27 GMT
రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీ నేత‌ల మ‌ధ్య విభేదాలు రోడ్డెక్కాయి. నేత‌లు బ‌హిరంగ స‌వాళ్ల‌కు సైతం సిద్ధ‌మ‌య్యారు. అధినేత చంద్ర‌బాబు.. అంద‌రినీ క‌లిసి ఉండాల‌ని చెబుతున్నా.. ఆయ‌న చేసిన నిర్వాకంతో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణి వారిని కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. నిన్న మొన్న‌టి వ‌రకు నివురు గప్పిన నిప్పులా ఉన్న నెల్లూరు టీడీపీ నేత‌ల మ‌ధ్య విభేదాలు ఒక్క‌సారిగా భగ్గుమ‌న్నాయి. రోడ్డెక్కేలా చేశాయి. విష‌యంలోకి వెళ్తే.. కాంగ్రెస్ నుంచి వ‌చ్చి టీడీపీలో చేరిన ఆనం సోద‌రుల‌కు - ఎప్ప‌టి నుంచో టీడీపీలో ఉంటూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేసిన క‌న్న‌బాబు మ‌ధ్య ఆధిప‌త్యం విష‌యంలో ప‌చ్చ గ‌డ్డి వేసినా భ‌గ్గు మ‌నే ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఆఖ‌రుకు నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్‌కు ఈ వివాదాలు చేరిపోయాయి.

తాజాగా.. ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జి ఆనం రామనారాయణరెడ్డి - మాజీ ఇన్‌ చార్జి కన్నబాబు వర్గాల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమశిల ఉత్తర కాలువ ద్వారా జరుగుతున్న నీటి సరఫరాను పరిశీలించేందుకు ఆనం ఆత్మకూరు చెరువు వద్దకు వచ్చారు. తొలుత పూజలు చేసి నీటి సరఫరాపై సోమశిల ప్రాజెక్ట్‌ ఈఈ - సాగునీటి శాఖ డీఈలతో మాట్లాడారు. ఈ క్రమంలో కన్నబాబు వర్గానికి చెందిన చెరువు సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడు మాదాల మస్తాన్‌ నాయుడు కూడా అక్క‌డే ఉన్నారు. ఆయ‌న‌ మాట్లాడేందుకు ప్రయత్నించగా సాగునీటి సంఘం అధ్యక్షుడు ఎక్కడంటూ ఆనం ప్రశ్నించారు. అదే సమయంలో ఆనంకు అనుకూలంగా ఉన్న రైతులు ‘గతంలో 2వ నంబర్‌ తూముకు నీళ్లు వచ్చేవని - ఇప్పుడు ఎందుకు రావడం లేదని’ ఉపాధ్యక్షుడిని నిలదీశారు.

‘మీ వల్లే నీళ్లు రావడం లేదు - మా పంటలు ఎండిపోతున్నాయి - ఆ తూము కింద 350 ఎకరాలు సేద్యం నీరు లేక ఆపామని’ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరుకు చెందిన ఆనం అనుకూలుడు - రైతు చిట్టమూరు వెంకురెడ్డి ‘మీ వంటి వాళ్లు సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడిగా పనికి రారని - మీ అధ్యక్షుడు(క‌న్నబాబు వ‌ర్గం) నీళ్ల సమస్య అడుగుతారనే ఇక్కడికి రాలేదని, ఇద్దరూ వెంటనే రాజీనామా చేయాలని’ డిమాండ్ చేశారు. దీనికి ప్ర‌తిగా నీటి సంఘం ఉపాధ్యక్షుడు ‘మేము రాజీనామా చేస్తాం. మీకిష్టమొచ్చిన వారిని పెట్టుకోండి’ అని రుసరసలాడారు. అధికారులు మాత్రం 75 క్యూసెక్కుల నీటిని వదిలామని అంటున్నారే తప్ప ఒక్క చుక్క కూడా చెరువుకు నీరు రావడం లేదని, పొలాలు బీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

ఈ సంద‌ర్భంలో కలుగ జేసుకున్న ఆనం..  నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కాలువపై తనిఖీలు చేయాలని - ఆత్మకూరు చెరువుకు కచ్చితంగా 60 క్యూసెక్కులు ఇవ్వాల్సిందేన్నారు.దీంతో వివాదం పెరిగిపోయింది. ఆనం వర్గీయులు తమ వారిపై విమర్శలు చేయడంపై కన్నబాబు వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలినుంచి పార్టీలో ఉన్న తమను పట్టించుకోవడం లేదని ఏకంగా చంద్ర‌బాబు పైనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ వ్యవహారం పార్టీలో చర్చకు దారితీసింది. గతంలోనూ ఈ రెండు వర్గాల నాయకులు ప‌లు విష‌యాల్లో రోడ్డెక్కారు.  పైకి తామంతా ఒకేలా ఉన్నామని చెబుతున్నా అవకాశం చిక్కినప్పుడల్లా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఒకటి - రెండు సార్లు వీరి వ్యవహారం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది.  మ‌రి ఈ వివాదం ఇక్క‌డితో ఆగుతుందో లేక మ‌రింత ముదురుతుందో చూడాలి.
Tags:    

Similar News