వైసీపీలో అసమ్మతి సెగ మొదలైనట్టేనా...?

Update: 2022-12-29 02:30 GMT
అధికార వైసీపీలో అసమ్మతి స్వరం తొలిసారిగా బయటపడింది. అది కూడా మంచి టైమింగ్ తో. సీనియర్ మోస్ట్ నేత. నెల్లూరు కి పెద్ద రెడ్డిగా పేరున్న మాజీ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి సొంత ప్రభుత్వం మీదనే బాణాలు వేశారు. నిజంగా అవి బాంబుల మాదిరిగా ఉన్నాయని వైసీపీలో చర్చ సాగుతోంది.

ఒక వైపు చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. అదే సమయంలో ఆనం నోట అసమ్మతి గళం వినిపించింది. ఆనం వారు చాలా కాలంగా గుంభనంగా ఉంటున్నారు. ఇపుడు ఆయన కరెక్ట్ టైం చూసుకుని మరీ జగన్ సర్కార్ మీద నిప్పులే చెరిగారు అంటున్నారు. గత ఎనిమిది నెలలుగా ఏపీలో గడప గడపకు కార్యక్రమం సాగుతోంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి ఎమ్మెల్యేలు మంత్రులు జంకుతున్నారు. ఏదో మొక్కుబడిగా వెళ్తూ హాజరీ వేయించుకుంటున్నారు

తప్పించి జగన్ చెప్పినట్లుగా ప్రతీ సచివాలయాన్ని టచ్ చేయడం లేదు. అదే విధంగా ప్రతీ ఇంటికి వెళ్ళి పది నిముషాలు ఉండడంలేదు. ఎందుకిలా అంటే అందరిలోనూ అనేక ప్రశ్నలు. అనేకమైన డౌట్లు. అలాగే అనేకమైన ఆలోచనలు, భయాలు ఉన్నాయి. అలాగే అందరిలో ప్రభుత్వ విధానాల మీద తెలియని వ్యక్తం చేయలేని ఆవేదన ఆగ్రహం ఉంది.

అవన్నీ ఆనం వారి నోటి వెంట చకచకా తన్నుకుంటూ వచ్చాయా అన్న చర్చ అయితే సాగుతంది. ఆనం లేవనెత్తిన ప్రతీ పాయింటూ కూడా గడప గడపకూ వెళ్ళే వైసీపీ ఎమ్మెల్యేలు ఎదుర్కొనేవే. అందుకే అలా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఆనం బిగ్ సౌండ్ చేశారు అని అంటున్నారు నెమ్మదిగా మాట్లాడినా కూడా నగ్న సత్యాలే ఆనం రావూరు నియోజకవర్గ సమావేశంలో చెప్పారని అంటున్నారు.

ఒక విధంగా ఆనం ఇలా బయటపడ్డాక కచ్చితంగా వైసీపీలో తెలియని అసమ్మతి సెగలు చాలానే ఉన్నాయని అంటున్నారు. అవి ఒక్కసారిగా బయటపడ్డాయని చెబుతున్నారు. ఆనం సీనియర్ కాబటి గట్స్ ఉన్న నేతగా తానే మొదట బయటపడ్డారని అంటున్నారు. పైగా తనను వైసీపీ అధినాయకత్వం ఏమి చేసినా తట్టుకునే ప్లాన్స్ తోనే ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. లేకపోతే చంద్రబాబు ఒక వైపు నెల్లూరు టూర్లో ఉండగా సొంత ప్రభుత్వం మీద అసంతృప్తి స్వరాన్ని వినిపిస్తూ పరువు బజారున వేయడం అంటే సామాన్య విషయమా అని అంటున్నారు.

ఆనం డేరింగ్ అండ్ డేషింగ్ గా వైసీపీలో ప్రస్తుతం ఉన్న విషయాన్ని చెప్పారని, పైగా ఒకటికి పదిసార్లు ఆయన చెబుతున్నది కూడా ఒక్కటే. అన్నీ వాస్తవాలు. అక్షర సత్యాలు అంటున్నారు. అంటే వైసీపీ  ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా జనాలకు చేసింది ఏమీ లేదు అని సొంత పార్టీ ఎమ్మెల్యేవే ఇలా మైకు అందుకుని వీధిన పడి చెప్పడం అంటే వైసీపీలో అసమ్మతి గళం ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవాలని అంటున్నారు.

తాము నాలుగేళ్ళుగా ఏమి చేశామని జనాలు ఓట్లు వేస్తారు అని ఆనం అడిగిన తీరు వైసీపీ అధినాయకత్వానికి దిమ్మతిరిగిపోయే స్థాయిలోనే ఉంది అని అంటున్నారు. మనమేమి చేశాం, ప్రాజెక్టులు కట్టామా. కాలువలు తవ్వామా తాగు నీరు ఇచ్చామా ఆఖరుకు నెల్లూరులోని ఎస్ ఎస్ కెనాల్ విషయంలో ఎన్నో సార్లు తాను అసెంబ్లీలోనూ బయటా ప్రభుత్వానికి చెప్పినా కూడా పట్టించుకోలేదని ఆయన విమర్శలు సంధించారు అంటే కచ్చితంగా వైసీపీ సర్కార్ ఇరుకున పడినట్లే అంటున్నారు.

ఇక ఇక్కడ ఒక సెంటిమెంట్ ని కూడా ఆనం వారు టచ్ చేశారు. ఎస్ ఎస్ కెనాల్ పూర్తి చేయడం వైఎస్సార్ కల అని దాన్ని కూడా పూర్తి చేయలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామంటే ఏమనుకోవాలి అని ఆయన అంటున్నారు. ఇది వైఎస్సార్ వారసత్వ ప్రభుత్వమని చెప్పుకుంటున్న జగన్ సర్కార్ కే అవమానమని ఆనం అనకుండానే అన్నీ అంటించేశారు.

అపనమ్మకంతోనే అంతా పనిచేస్తున్నామని, ప్రస్తుతం తనను కూడా జనాలు అసలు నమ్మడంలేదంటూ వైసీపీ పెట్టుకున్న వైనాట్ 175 సీట్ల మీద బండెడు నీళ్ళు ఆయన కుమ్మరించేశారు. చేసుకుంటున్న ప్రచారం అంతా డొల్ల అని తేల్చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా పదిహేను నెలల సమయం ఉండగానే ఆనం నోట అసమ్మతి గళం వినిపించడం అపశకునమే అంటున్నారు. ఇపుడున్న పరిస్థితిల్లో నెల్లూరు పెద్దాయనను ఏమీ చేయలేరు. ఏమి చేసినా ఆయనకే మేలు జరుగుతుంది. పైగా ఆయన అన్న విషయాలు నిజాలని సొంత పార్టీలో చర్చ సాగుతోంది.

పోనీ ఆయన మాటలను లైట్ తీసుకుని వదిలేద్దామంటే రేపటి నుంచి మరింతగా స్వరం పెంచే సీన్ ఉంటే అన్న బెంగ ఎటూ ఉంటుంది. ఇక ఆనం అన్న తరువాత అదే బాటలో మరికొందరు నడిస్తే కొంప కొల్లేరు అవుతుంది అన్నది కూడా పార్టీలో చర్చ ఉంది. మొత్తానికి వైసీపీలో ఇన్నాళ్ళూ లోపల దాగున్న అసమ్మతిని పిల్లి మెడలో గంట కట్టినట్లుగా ఆనం కట్టి బయటకు లాగారు. ఇపుడు లాక్కోలేక పీక్కోలేక అన్నట్లుగా వైసీపీ పెద్దల పరిస్థితి ఉంది అంటున్నారు. మరి ఆనం తో పాటు ఎన్ని గొంతులు పైకి లేస్తాయనందే ఇపుడు పార్టీ లోపలా బయటా సాగుతున్న కొత్త చర్చగా ఉందిట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News