జగన్ ఏడాది పాలన... కేకు సంబరాలే - అభివృద్ధి శూన్యం : వైసీపీ ఎమ్మెల్యే

Update: 2020-06-03 14:00 GMT
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఇటీవలే ఏడాది పూర్తి అయ్యింది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 90 శాతానికి పైగా హామీలను అమలు చేశామని చెప్పుకుంటున్న జగన్... తాను అనుకున్నది సాధించేశానని చెప్పుకున్న వైనం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ ఏడాది పాలనను పురస్కరించుకుని ఆ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సంబరాలపై ఆ పార్టీకే చెందిన సీనియర్ రాజకీయవేత్త, వైసీపీకి క్లిన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలనాలకే సంచనాలుగా నిలుస్తున్న వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్ ఏడాది పాలనలో కేవలం కేకు సంబరాలు తప్పిస్తే... అభివృద్ధి జాడలే కనిపించడం లేదని ఆనం నిజంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఆనం.. మొన్నటి ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీలో చేరారు. వెంకటగిరి టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. అయితే మంత్రివర్గంలో ఆనంకు చోటు దక్కుతుందని చాలా మంది అనుకున్నా.. జగన్ లెక్కలు వేరేగా ఉండటంతో ఆనంకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో మంత్రి పదవి దక్కకున్నా ఏమాత్రం అసంతృప్తి వెళ్లగక్కకుండా ఉండిపోయిన ఆనం... ఇప్పుడు జగన్ ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో గళం వినిపించారు. అసలు తన నియోజకవర్గం వెంకటగిరిలో ఈ ఏడాది కాలంలో సింగిల్ అభివృద్ధి పని కూడా జరగలేదని ఆనం సంచలన వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా సీఎం జగన్ రాసిన లేఖలకే అధికారులు విలువ ఇవ్వడం లేదని, సీఎంగా ఉన్న జగన్ లేఖకే దిక్కు లేకపోతే.. ఇక అబివృద్ధి ఎక్కడ ఉందని కూడా ఆనం ప్రశ్నించారు.

అయినా ఆనం ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప నా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. సీఎం జగన్ లేఖకే దిక్కు లేని పరిస్థితి. మంత్రులు, అధికారులు జగన్ లేఖనే పట్టించుకోవడం లేదు. మరో ఏడాది చూస్తా. పనులు జరగకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తా. నెల్లూరు జిల్లాలో జలదోపిడీ లెక్కలు తేల్చాలి’’ అని ఆనం ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు. మొన్నటికి మొన్న ఇసుక విధానంపై గుంటూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నిరసన గళం వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏకంగా సీఎం జగన్ ఆదేశాలకే దిక్కు లేదంటూ అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత వ్యాఖ్యానించడం ఇప్పుడు నిజంగానే సంచలనంగా మారిపోయింది.
Tags:    

Similar News