ఆ వైసీపీ సీనియ‌ర్ నేత అల‌క‌కు రీజ‌న్ ఇదేనా..?

Update: 2019-08-29 05:02 GMT
ఆయ‌న వైసీపీ సీనియ‌ర్ నేత‌. ఉమ్మ‌డి రాష్ట్రంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అనేక ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న వైసీపీ గూటికి చేరారు. నిర్దిష్ట‌మైన విమ‌ర్శ చేయ‌డంలో ఆయ‌న దిట్ట‌. 2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఇప్పుడు ఎందుకోగానీ.. అల‌క‌బూనార‌నే టాక్ వినిపిస్తోంది. ప్ర‌భుత్వంపై - ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ పై ప్ర‌తిప‌క్షం - ప్ర‌జ‌ల నుంచి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఆయ‌న మౌనంగానే ఉంటున్నారు. కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితమవుతున్నారు.

స్పందించాల్సిన స‌మ‌యంలో ఆ సీనియ‌ర్ నేత ఇలా ఉండ‌డంపై పార్టీ - ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ ఆ సీనియ‌ర్ నేత ఎవ‌ర‌ని అనుకుంటున్నారా..? ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి. నెల్లూరు జిల్లాలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి కీల‌క నేత‌. 2019 ఎన్నిక‌ల్లో వెంక‌ట‌గిరి నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే.. మంత్రివ‌ర్గంలో స్థానం ద‌క్క‌క‌పోవ‌డంతో.. ఆయ‌న అల‌క‌బూనిన‌ట్టు తెలుస్తోంది. అప్ప‌టి నుంచే ఆయ‌న పూర్తిగా సైలెంట్ అయిపోయార‌నే టాక్ వినిపిస్తోంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో మంత్రిగా ప‌నిచేసిన త‌న‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌నీస ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని అనుచ‌రుల‌తో అంటున్నట్లు తెలుస్తోంది.

అయితే.. ఇటీవ‌ల రాజ‌ధాని - అన్నాక్యాంటిన్లు - త‌దిత‌ర అంశాల్లో ప్ర‌భుత్వంపై - ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయినా.. ఆనం మాత్రం నోరు తెర‌వ‌డం లేదు. త‌న‌కేమీ సంబంధం లేద‌న్న‌ట్లు ఉంటున్నార‌ని వైసీపీ వ‌ర్గాలు అంటున్నాయి. నిజానికి.. నెల్లూరు జిల్లాలో చాలామంది నేత‌లే ఉన్నా.. ఆనం లాగా నిర్దిష్టంగా మాట్లాడ‌లేరు. దీంతో ప్ర‌తిప‌క్ష విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్ట‌డంతో జిల్లా వైసీపీ నేత‌లు కింద‌మీద‌ప‌డుతున్నారు.

అయితే.. నెల్లూరు జిల్లాలో పలువురు నేత‌లు ఉన్నా.. వారు మాట్లాడితే.. ఏదో ఒక వివాదం నెల‌కొంటోంది. నెల్లూరు సిటీ నుంచి గెలిచిన అనిల్ కుమార్ యాద‌వ్ జ‌గ‌న్ కేబినెట్‌ లో మంత్రిగా ఉన్నారు. ఆయ‌న కూడా ఎడాపెడా మాట్లాడుతారు కానీ.. అవి చివ‌ర‌కు ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేస్తాయ‌నే టాక్ వైసీపీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి మాట్లాడినా.. ఏదో ఒక వివాదం ముంచుకువ‌స్తుంద‌ట‌.

ఇలాంటి స‌మ‌యంలో ఆనం మాత్ర‌మే నిర్దిష్టంగా విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతార‌ని - కానీ.. ఆయ‌న మౌనంగా ఉండ‌డం ఏమిట‌నే టాక్ పార్టీవ‌ర్గాల్లో ఉత్ప‌న్న‌మ‌వుతోంది. అయితే..ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. మేన‌ల్లుడికి కూడా నామినేటెడ్ ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంకూడా ఆనం అల‌క‌కు మ‌రొక కార‌ణంగా తెలుస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిని ఎలా బుజ్జ‌గిస్తారో.. లేక‌.. అలాగే వ‌దిలేస్తారో చూడాలి మ‌రి.


Tags:    

Similar News