బాబు ఓ నావికుడు...లోకేష్ యువ‌నేత‌

Update: 2016-09-06 06:44 GMT
మాజీ ఎమ్మెల్యే - తెలుగుదేశం పార్టీలో కొద్దికాలం క్రితం చేరిన నెల్లూరు నాయకుడు ఆనం వివేకానందరెడ్డి త‌న‌దైన శైలిలో ఏపీలోని రాజ‌కీయ ప‌రిస్థితులపై స్పందించారు. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేసిన ప‌రిపాల‌న ప‌ర‌మైన విమ‌ర్శ‌ల‌ను ఆనం త‌ప్పుప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా బాబును పెద్ద ఎత్తున కీర్తిస్తూ...జ‌గ‌న్‌ పై విమ‌ర్శ‌లు చేశారు. "చంద్రబాబునాయుడుని తెలుగుదేశం అధినాయకుడిగానో - ముఖ్యమంత్రిగానో రాష్ట్ర ప్రజలు చూడటంలేదు. నడి సముద్రంలో మునిగిపోతున్న పడవను దశలు - దిశలు తెలిసి ఒడ్డుకు చేర్చగల నావికుడిలా  ప్రజలు భావిస్తున్నారు. మునిగిపోతున్న పడవలా రాష్ట్ర పరిస్థితి ఉంది. అన్నివిధాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, బ్రహ్మాండమైన రాజధాని అమరావతిని నిర్మించేందుకు కూడా ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతూ నావికుడిలా కష్టపడుతున్నారు. ఇది గ‌మ‌నించు జ‌గ‌న్‌" అంటూ ఆనం వ్యాఖ్యానించారు.

వానలు లేక - నీరులేక కరవుతో తాండవిస్తున్న అనంతపురం - కర్నూలు - కడప - చిత్తూరు జిల్లాల్లో రైతులను ఆదుకునేందుకు అక్కడే మకాం వేసి పంటలు పండించేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను అభినందించాల్సిన ప్రతిపక్ష నేత జగన్‌ ధర్నాలు - ఆందోళనలు - పికెటింగ్‌ లు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆనం అన్నారు. చేతనైతే రాయలసీమ కరవు నుంచి గట్టెక్కే ఒక ఆలోచనేదైనా ఉంటే చెప్పాలని సూచించారు. జ‌గ‌న్ సంపాదించుకున్న రూ.లక్ష కోట్లలో కొంతైనా ఖర్చుచేసి రాయలసీమ జిల్లాల రైతులను ఆదుకునేందుకు కొంతైనా సహకరించాలని ఆనం పేర్కొన్నారు. ఎండలు ఎక్కువైనా - వానలు జాస్తిగా కురిసినా, సాయంత్రం సూర్యుడు అస్తమించినా అందుకు కారణం చంద్రబాబునాయుడే అని జగన్‌ చేస్తున్న విమర్శలు - పిచ్చి పిచ్చి అసంబంద్ధ ఆరోపణలు మానుకోవాలని కోరారు. అవినీతి కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన జగన్‌.. రాష్ట్రానికి యువనేతగా ప్రజల ముందుకు వస్తున్న లోకేష్‌ బాబుకు పాఠాలు నేర్పాలని జగన్‌ అనడం ఎంతవరకు సబబు అని ఆనం ప్రశ్నించారు.
Tags:    

Similar News