సోమవారం ఆఫీసుకెళ్లలేకపోతున్నారా..? ఇలా చేస్తే 'ఆనందో'బ్రహ్మలే.

Update: 2022-08-01 13:30 GMT
మనలో చాలామందికి ఆదివారం సెలవు తర్వాత సోమవారం ఆఫీసుకెళ్లాలంటే అదో రకమైన ఇబ్బంది. మానసికంగా సిద్ధం కాలేకపోవడమే దీనికి కారణం. అందులోనూ వారంలో ఐదు రోజులే పని దినాలున్నవారైతే మరింత అసౌకర్యంగా ఫీలవుతుంటారు. అబ్బా.. అప్పుడే ఆదివారం అయిపోయిందా..? అనే భావనలో ఉంటారు. ఆఫీసుకెళ్లాక కొన్ని గంటల తర్వాత కానీ.. మామూలు ఉద్యోగి కాలేకపోతారు. ఇక అక్కడి నుంచి శుక్రవారం వరకు ఉరుకులు, పరుగులు. శనివారం ఆఫీసు ఉన్నవారైతే.. ఆ రోజూ హడావుడే. ఇంకొందరైతే మళ్లీ శనివారం లేదా సెలవు రోజు ఆదివారం ఎప్పుడొస్తుందా? అని చూస్తుంటారు.

ఎందుకిలాంటి ఇబ్బంది..?

సహజంగా ఆదివారం సెలవు దినం అనే భావన మన మనసులో స్థిరపడిపోయింది. పాశ్చాత్య దేశాల్లో అయితే ఆదివారం నాడు ఇటు పుల్ల తీసి అటు పెట్టరు. వీకెండ్ ను అంత బాగా ఎంజాయ్ చేస్తారు వారు. ఇక మన దేశానికి వస్తే.. అతి కొన్ని రంగాల వారికి మినహా మిగతా అందరికీ ఆదివారం సెలవే. ''ఆదివారం అందరికీ సెలవు'' అనే నానుడి కూడా ఉంది. అందుకనే సోమవారం ఆఫీసులకు వెళ్లాలనుకునేవారు ప్చ్‌.. అప్పుడే సెలవు రోజు అయిపోయిందా..? అని భావిస్తుంటారు.

సలహాల్లో ఆయన స్టైలే వేరు..

ఆనంద్ మహీంద్రా.. ప్రముఖ వ్యాపారవేత్త. సోషల్ మీడియాలో మహా చురుకు. వ్యాపారం నుంచి ఆర్థికం వరకు.. అంకురాల నుంచి మహా ఆవిష్కరణల దాకా ఆయన ఎక్కడ కొత్తదనం, విభిన్నత కనిపించినా ట్వీట్ చేస్తుంటారు. ఇలా అనేక అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా సోమవారం బద్ధకం గురించి ఇలాంటి సలహానే ఒకటి ఇచ్చారు. సోమవారం తిరిగి ఆఫీసులకు వెళ్లాలంటే అసౌకర్యంగా భావించేవారు.. ఎలా ప్రేరణ పొందాలో సూచించారు.

మనకు ప్రేరణనిచ్చే వాటికోసం ఎక్కడో వెతకాల్సిన పనిలేదంటూ.. కామన్వెల్త్ క్రీడల్లో పోటీపడుతోన్న క్రీడాకారులను చూపించారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట పండిస్తోన్న వారిని ఉద్దేశించి తనదైన శైలి కాంప్లిమెంట్ ఇచ్చారు. మండే మోటివేషన్ హ్యాష్ ట్యాగ్‌తో ఆయన చేసిన ట్వీట్‌ అందరినీ మెప్పిస్తోంది.

ఇంతకూ ఆయనిచ్చిన సలహా ఏమిటంటే..

ప్రస్తుతం కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం భారత లిఫ్టర్లు స్వర్ణం, రజతం సాధించారు. మీరాబాయి చాను అంతకుముందు 49 కేజీల విభాగంలో 201 కేజీల బరువెత్తి ఈ భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ కొత్త చరిత్ర లిఖించింది. ఆదివారం పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్రినుంగా దేశానికి రెండో పసిడి అందించగా.. 73 కేజీల విభాగంలో 20ఏళ్ల అచింత షూలి పసిడి పతకం సాధించాడు. ఈ పోటీల్లో ఇప్పటి వరకు మన దేశానికి ఆరు పతకాలు రాగా.. వాటిల్లో మూడు స్వర్ణ, రెండు రజత, ఒక కాంస్య పతకాలున్నాయి. అవన్నీ వెయిట్‌ లిఫ్టింగ్ విభాగంలోనే దక్కాయి.

ఇలా బరువులు ఎత్తుతూ పతకాల పంట పండిస్తోన్న క్రీడాకారులపై మహీంద్రా ట్వీట్ చేశారు. 'మండే మోటివేషన్ కోసం మన ఎక్కడైనా వెతకాల్సిన అవసరం ఉందా..? మనం మోస్తున్న బరువును బంగారంగా మార్చడం ఎలానో ఈ ముగ్గురు అథ్లెట్లు చూపించారు'అంటూ చాను, జెరేమీ, అచింత వెయిట్‌ లిఫ్ట్ చేసినప్పటి చిత్రాలను షేర్ చేశారు.
Tags:    

Similar News