అనంత‌పురం జిల్లా భూముల ధ‌ర‌లు ఆకాశ‌మే హ‌ద్దు!

Update: 2019-01-26 05:36 GMT
క‌రువు జిల్లాగా.. దేవుడి నిర్ల‌క్ష్యానికి గురైన ప్రాంతంగా చెప్పుకునే అనంత‌పురం జిల్లాలో భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చేశాయి. వాన చినుకు ప‌డితే అద్భుతంగా ఫీల‌య్యే ఈ క‌ర‌వు నేల ఇప్పుడు కోట్ల రూపాయిల ధ‌ర ప‌లుకుతోంది. ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో అనంత‌పురం జిల్లా సుడి తిరిగిపోయింద‌ని చెబుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కూ ఎక‌రం భూమి కొన‌టానికి త‌ట‌ప‌టాయించిన వారికి.. ఇప్పుడు సెంటు భూమి ద‌క్కాలంటే ల‌క్ష‌లాది రూపాయిలు చెల్లించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది.

జిల్లాకు వ‌చ్చిన ప్రాజెక్టుల కార‌ణంగా ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెబుతున్నారు. జిల్లా మొత్తంగా భూముల ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఒక‌ప్పుడు అనంత‌పురం జిల్లా మీద ఆస‌క్తి చూప‌ని ప‌లువురు సంప‌న్నుల దృష్టి ఇప్పుడీ క‌ర‌వు జిల్లా మీద ప‌డ‌టంతో సీన్ మొత్తం మారిపోయింది.

గ‌డిచిన నాలుగేళ్ల‌లో ఎప్పుడు లేని రీతిలో భూముల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. అనంత‌పురం ప‌ట్ట‌ణంలో అయితే చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సెంటు (దాదాపు 48 గ‌జాలు) భూమి 40 ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌లు ప‌ల‌టం చూస్తే.. హైద‌రాబాద్‌ లోని ప‌లు ప్రాంతాల్లో కూడా ఇంత డిమాండ్ లేద‌ని చెప్పాలి. హైద‌రాబాద్ లోని మియాపూర్ లాంటి ప్రాంతంలోనూ గ‌జం రూ.70వేలు మాత్ర‌మే. అలాంటిది అక్క‌డెక్క‌డో అనంత‌పురం ప‌ట్ట‌ణంలో భారీ స్థాయిలో భూములు ధ‌ర‌లు పెర‌గ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

చివ‌ర‌కు అనంత‌పురం న‌గ‌ర శివారులోనూ భూముల ధ‌ర‌లు భారీగా పెరిగాయి. బెంగ‌ళూరు.. హైద‌రాబాద్ ర‌హ‌దారిని అనుకొని ఉన్న శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో నాలుగేళ్ల క్రితం ఎక‌రా రూ.30 ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌లు ప‌లికేది. ఆ భూమి కాస్తా ఇప్పుడు కోటిన్న‌ర వ‌ర‌కూ ప‌ల‌క‌టం గ‌మ‌నార్హం. ఒక‌వేళ‌.. అంత డ‌బ్బులు పోసినా భూమి దొరక‌ని ప‌రిస్థితి.

అనంత‌పురానికి చుట్ట‌ప‌క్క‌ల భారీగా వెంచ‌ర్లు వెలిశాయి. న‌గ‌రానికి ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న వెంచ‌ర్ల‌లోనూ నాలుగు సెంట్ల భూమి రూ.20ల‌క్ష‌లు ప‌ల‌క‌టం విశేషం. ప్ర‌ఖ్యాత కియో కార్ల కంపెనీ జిల్లాకు రావ‌టం.. మ‌రిన్ని కంపెనీలు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో భూముల ధ‌ర‌లు ఇంత భారీగా పెరిగిన‌ట్లుగా చెబుతున్నారు.

అనంత‌పురం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న భూముల ధ‌ర‌ల్ని చూస్తే..
+ అనంత‌పురం నుంచి గుత్తి వైపు వెళ్లే నేష‌న‌ల్ హైవే ఇరువైపులా ఎక‌రం భూమి రూ.40 ల‌క్ష‌ల నుంచి రూ.60ల‌క్ష‌లు
+ అనంత‌పురం నుంచి చెన్నై వెళ్లే నేష‌న‌ల్ హైవేలోనూ ఎక‌రం భూమి రూ.80ల‌క్ష‌ల‌కు పైనే
+ అనంత‌పురం నుంచి క‌డ‌ప రోడ్డు మార్గంలో ఎక‌రం భూమి విలువ రూ.70ల‌క్ష‌ల‌కు పైనే.
+ అనంత‌పురం నుంచి బ‌ళ్లారి వెళ్లే నేష‌న‌ల్ హైవేకి ఇరువైపులా సెంటు రూ.6 నుంచి 7ల‌క్ష‌లు ప‌లుకుతోంది
+ అనంత‌పురం న‌గ‌ర శివారులో సెంటు భూమి రూ.3 నుంచి రూ.5ల‌క్ష‌ల వ‌ర‌కూ ప‌లుకుతోంది
+ కియో కార్ల కంపెనీ స‌మీపంలో భూముల‌కు ఎక‌రా రూ.కోటి వ‌ర‌కూ ధ‌ర న‌డుస్తోంది


Tags:    

Similar News