జేసీని తిట్టి పోస్తున్న అనంత త‌మ్ముళ్లు

Update: 2018-06-15 10:29 GMT
అనంత‌పురం జిల్లాలో రాజ‌కీయం ఇప్పుడు హాట్ హాట్ గా ఉంది. జిల్లాకు చెందిన ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి పుణ్యమా అని ఇప్పుడీ ప‌రిస్థితి ఉందంటున్నారు. తిరిగే కాలు.. తిట్టే నోరు కుదురుగా ఉండ‌వ‌న్న సామెత‌కు త‌గ్గ‌ట్లే జేసీ ఈ మ‌ధ్య‌న చేసిన ఒక వ్యాఖ్య తాజా ప‌రిస్థితికి కార‌ణంగా చెబుతున్నారు. త‌ర‌చూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే ఆయ‌న‌.. త‌న గొప్ప‌త‌నాన్ని ప్ర‌ద‌ర్శించుకోవాల‌నుకున్నారో.. అధినేత చంద్ర‌బాబు త‌న మాట‌కు ఇచ్చే ప్ర‌యారిటీ ఎంత‌లా ఉంటుంద‌న్నది చెప్పుకోవాల‌నుకున్నారో కానీ.. సంచ‌ల‌న వ్యాఖ్య ఒక‌టి చేశారు.

కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లుగా మాట్లాడ‌టం.. విష‌యం ఏదైనా సూటిగా సుత్తి లేకుండా చెప్పేసే జేసీ.. ఇటీవ‌ల జ‌రిగిన ఒక స‌మావేశంలో మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లాలోని 14 స్థానాల్లో పార్టీ గెల‌వ‌టానికి తాను ఒక జాబితాను సిద్ధం చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఎందుకిలా అంటే.. ప్ర‌స్తుతం ఉన్న సిట్టింగుల్లో ఇద్ద‌రు ముగ్గురు త‌ప్పించి మిగిలినోళ్లంతా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌టం ఖాయ‌మ‌ని.. అందుకే గెలుపు గుర్రాల మీద తాను ఒక జాబితాను త‌యారు చేసిన సీఎం బాబుకు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

జేసీ ప్ర‌క‌ట‌న‌పై తెలుగు త‌మ్ముళ్లు ర‌గిలిపోతున్నారు.  ఎవ‌రు గెలుస్తారు?  ఎవ‌రు ఓడిపోతారో చెప్ప‌టానికి జేసీ ఎవ‌రంటూ నిల‌దీస్తున్నారు. గెలుపోట‌ముల‌పై బాబుకు బాగానే తెలుసని.. ఎవ‌రికి టికెట్ ఫైన‌ల్ చేయాలో బాబుకు బాగా తెలుస‌ని.. మ‌ధ్య‌లో జేసీ కెల‌కాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. జేసీ ఎవ‌రికైనా టికెట్లు ఇవ్వాల‌ని చెబితే.. బాబు క‌చ్ఛితంగా ఇవ్వ‌రంటూ కొంద‌రు ఎమ్మెల్యేలు జేసీకి చుర‌క‌లేస్తున్నారు. త‌న నోటి మాట‌తో జిల్లాలోని ప‌లువురు ఎమ్మెల్యేల‌కు కంట‌గింపుగా మారిన జేసీ తీరు ఇప్పుడ‌క్క‌డ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది.
Tags:    

Similar News