వాళ్లు ఒక్కరూ ఓటేయలేదు..

Update: 2019-04-14 09:45 GMT
దేశవ్యాప్తంగా పోలింగ్ జరుగుతోంది. బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ దీవుల్లోని అతి పురాతనమైన ఆదిమ తెగ అయిన షొంపెన్ల కోసం కూడా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  అయితే వాళ్లలో ఒక్కరు కూడా ఓటు వేయడానికి రాకపోవడం గమనార్హం.

మంగోలాయిడ్ తెగకు చెందిన వీరు నాగరిక సమాజంలో కలవడానికి ఇష్టపడరు. అడవుల్లోంచి బయటకు రావడానికే జంకుతారు. అడవుల్లో దొరికినవే తిని బతుకుతారు. బాగా పరిచయం ఉన్న వారికి తప్ప ఇతరులను దగ్గరకు రానివ్వరు. అధికారులు అతి కష్టం మీద వీరికి ఓటరు కార్డు చేశారు. వీరిలో 107 మంది ఓటర్లు ఉన్నారు.

2014 ఎన్నికల్లో వీరు ఇద్దరంటే ఇద్దరు 75 ఏళ్ల పురుషుడు, 32 ఏళ్ల మహిళ మాత్రమే వచ్చి ఓటేశారు. ఈసారి మరింత ఎక్కువమందిని రప్పించి ఓటేయాలని అధికారులు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశారు. దీనికి స్పందించిన దాదాపు 35మంది షొంపెన్ తెగ వారు ఓటరు కార్డులతో సహా హాజరయ్యారు. దీనికోసం రెండు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.  అయినా కూడా ఒక్కరూ ఓటు వేయలేదని అధికారులు కాంప్ బెల్ బే అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ సింగ్ మీనా తెలిపారు.

అయితే ఇక్కడి ఓంగే, గ్రేట్ అండమాన్ తెగవాళ్లు కొన్నేళ్లుగా ఓటింగ్ లో పాల్గొంటుండడం విశేషం. ఈసారి 51మంది ఓంగేలు, 26మంది గ్రేట్ అండమానీస్ ఓటు వేశారు.
    

Tags:    

Similar News