కత్తులు దూసుకోవటమా.. కామ్‌ అయిపోవటమా..?

Update: 2015-06-29 05:15 GMT
నెల రోజులుగా సాగుతున్న ఓటుకు నోటు వ్యవహారం ఈ వారంతో ఒక కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడి.. తమ స్థాయికి మించి.. తమ పరిధి మీరి మరీ వ్యాఖ్యలు చేసుకోవటం తెలిసిందే.

బ్రహ్మదేవుడు దిగి వచ్చినా చంద్రబాబును కాపాడలేరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానిస్తే.. తనను అరెస్ట్‌ చేసిన రోజే తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఆఖరి రోజు అంటూ చంద్రబాబు వార్నింగ్‌ ఇవ్వటం తెలిసిందే.

ఓటుకు నోటు అని తెలంగాణ అధికారపక్షం అంటే.. ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ ఏపీ అధికారపక్షం అనటం తెలిసిందే. ఓటుకు నోటుతో మొదలై.. ఫోన్‌ ట్యాపింగ్‌.. సెక్షన్‌ 8.. ఇలా చాలానే అంశాలు చర్చకు వచ్చాయి. వీటన్నింటిలోనూ ఓటుకు నోటు వ్యవహారంలో కీలక పరిణామాలకు ఈ వారం వేదిక కానుంది. కేంద్రం జోక్యంతో గవర్నర్‌ మధ్యవర్తిగా రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిన ఓటుకు నోటు వ్యవహారాన్ని ముగించాలని చెప్పినట్లుగా వార్తలు రావటం తెలిసిందే.

ఈ వారంలో ఏర్పడే పరిణామాలు.. ఓటుకు నోటు వ్యవహారంపై భవిష్యత్తులో చోటు చేసుకునే పరిణామాలకు ప్రాతిపదికగా ఉంటుందని చెబుతున్నారు. ఈ కేసులో తమ విచారణకు హాజరు కావాలంటూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నోటీసులు జారీ చేయటం.. తనకు అనారోగ్యంగా ఉన్న కారణంగా వారం గడువు కోరటం.. సోమవారంతో అది పూర్తి కానుండటం తెలిసిందే. మరి.. సండ్ర ఏసీబీ విచారణకు హాజరు అవుతారా? లేదా? అన్నది ఒక ప్రశ్న.

ఇక.. ఈ కేసులో కీలకమైన రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటీషన్‌కు సంబంధించిన నిర్ణయం మంగళవారం వెలువడనుంది. రేవంత్‌కు బెయిల్‌ విషయంలో తెలంగాణ సర్కారు పట్టుదలగా ఉన్న విషయం తాజా విచారణలో బయటపడటం తెలిసిందే. మరోవైపు.. చంద్రబాబుకు నోటీసుల విషయంపై గత నాలుగు రోజులుగా ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌ వ్యూహరచన చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారంలో చోటు చేసుకునే పరిణామాలతో ఓటుకు నోటు వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాలు కత్తులు దూసుకుంటాయా? లేక.. కామ్‌ అయిపోతాయా? అన్న విషయం తేలిపోతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News