ఏపీ,తెలంగాణ పోలీసుల ఉమ్మ‌డి టార్గెట్ ఆర్కే...

Update: 2016-12-26 06:23 GMT
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ ఎలియాస్‌ ఆర్కే గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త వెలుగులోకి వ‌చ్చింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ ఆయ‌న‌కు గాయాలు అయ్యాయ‌ని, అంతేకాకుండా అది స‌ర్జ‌రీ చేసే స్థాయిలో ఉంద‌ని పోలీసు వ‌ర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఆర్కే జాడ కోసం  ఏపీ - తెలంగాణతో పాటు మ‌రో రెండు రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ అధికారుల వేట కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ వ‌ర్గాల‌తో పాటు ఒడిషా - ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాలకు చెందిన నిఘా విభాగం ఆర్కే కోసం పట్టు వదలకుండా ఆరా తీస్తున్నారని తెలిసింది.

గత అక్టోబర్‌ 24వ తేదీన ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లోని మల్కన్‌ గిరి జిల్లా బెజ్జంగి దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌ కౌంటర్‌ లో 37 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. అంతేగాక మరికొందరు మావోయిస్టులు తీవ్రంగా గాయపడి ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు - ఆ పార్టీ ఏఓబీ డివిజన్‌ ఇన్‌చార్జి కూడా అయిన ఆర్కేతో పాటు అతని గన్‌ మెన్‌ లు గాయపడ్డారు. మరో గన్‌ మెన్‌ ఈ ఘటనలో మరణించాడు. అయితే గాయపడ్డ ఆర్కే ఎక్కడున్నాడనేది మూడు రోజుల వరకు బయటపడలేదు. ఆయన ఆంద్రా గ్రేహౌండ్స్‌ అదుపులోనే ఉన్నాడని మావోయిస్టు సానుభూతి పరులు ఆరోపించడమే గాక ఆయన జాడ కోసం ఆర్కే భార్య హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. అయితే ఆర్కే తమ వద్దలేడని ఆంధ్రా డీజీపీ సాంబశివరావు కూడా ఆ సమయంలో ప్రకటించారు. చివరికి ఆర్కే క్షేమంగానే ఉన్నాడని సమాచారం రావడంతో ఆయన మిస్సింగ్‌ మిస్టరీకి తెర పడింది.

బెజ్జంగి లో జరిగిన మావోయిస్టుల సమావేశానికి ఆర్కే హాజరైనట్టు వచ్చిన పక్కా సమాచారంతోటే ఆంధ్రా-ఒడిషా పోలీసులు ఆ ప్రాంతాన్ని ముట్టడించారు కాని తాము అనుకున్న టార్గెట్‌ ను మిస్సయ్యారని వార్తలు వచ్చాయి. కాగా గ్రేహౌండ్స్‌ దళాలు జరిపిన కాల్పుల్లో ఆర్కే కూడా గాయపడినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఆ పరిస్థితిలోనే ఆ ప్రాంతం నుంచి ఆర్కే ను సాయుధ మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి తరలించినట్టు నిఘా వర్గాలు గుర్తించినట్టు సమాచారం. గాయపడ్డ ఆర్కేకు ఎక్కడ బుల్లెట్‌లు తగిలాయి, తీవ్రంగా రక్తస్రావమైందా? అతనికి ఎక్కడ చికిత్స జరిపించారు?ఆ చికిత్స ఇంకా కొనసాగుతున్నదా? చికిత్స జరిగితే ఎక్కడ జరిగింది? ఎవరు చికిత్స చేశారు? తదితర కోణాల నుంచి నాలుగు రాస్ట్రాల నిఘా అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా దండకారణ్యం పరిసరాలలోని పలువురు ఆర్‌ఎంపీ డాక్టర్లు మొదలుకుని ప్రయివేటు ఆస్పత్రుల వరకు నిఘా అధికారులు సమాచారం కోసం ఆరా తీసినట్టు తెలిసింది. అయితే ఎక్కడ కూడా తమకు అవసరమైన సమాచారం వీరికి అందలేదని తెలుస్తోంది.

మొత్తం మీద గాయపడ్డ ఆర్కే వయసు రీత్యా కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్టు మాత్రం నిఘా వర్గాలకు సమాచారం ఉందని తెలిసింది. ఏది ఏమైనప్పటికి ఆయనకు సర్జరీ జరిపే స్థాయిలోనే గాయాలైనట్టుగా నిఘా అధికారులు ఒక స్థిర అభిప్రాయానికి వచ్చి ఆ కోణం నుంచే మరింత సమాచారం కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారని తెలిసింది. ఇందు కోసం తమ ఇన్‌ ఫార్మర్‌ లను పెద్ద సంఖ్యలోనే రంగంలోకి దింపినట్టు తెలిసింది. బెజ్జంగిలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆర్కే కూడా తీవ్రంగా గాయపడినట్టు తమకు సమాచారం ఉందని, ఇంత వరకే తాము చెప్పగలమని ఒక పోలీసు వ‌ర్గాలు అంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News