అసెంబ్లీలో మార్షల్స్.. చర్చపై రచ్చ!

Update: 2016-09-09 07:18 GMT
రాష్ట్రంలో ప్రజాసమస్యలు పెద్దగా లేవనో.. మంత్రులు, ఎమ్మెల్యేలు అంత వారి వారి వ్యక్తిగత పనులతో అబిజీగా ఉన్నారనో.. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం ఎందుకనో... కారణాలు తెలియదు కానీ కేవలం మూడంటే మూడు రోజులే అసెంబ్లీ సమావేశాలు నడపాలని నిర్ణయించారు ప్రభుత్వ పెద్దలు. సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు మొదలవడానికి కొన్ని గంటల ముందు (అర్ధరాత్రి సమయంలో) ప్రత్యేక హోదా లేదని చెప్పడంతో.. ఇక అసెంబ్లీలో అధికారపక్షానికి తిప్పలు తప్పవని అంతా భావించారు. కానీ... ఈ విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం సంపాదించడానికే వైకాపా నేతలు రకరకాల తిప్పలు పడుతున్నారు.. మార్షల్స్ తో సైతం పోరాడుతున్నారు.

అంతా అనుకున్నట్లుగానే మొదటిరోజు సభ అలా ముగిస్తే.. రెండో రోజు కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టువిడవకుండా, మొండిగానే కూర్చుంది. రాష్ట్రానికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా అనే అంశంపై ప్రతిపక్షం చర్చకు ఏస్థాయిలో పట్టుబడుతున్నా.. ఏమాత్రం చలించకుండా వారి పని వారు చేసుకుపోతున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈ విషయంలో స్పీకర్ పోడియంను సైతం చుట్టుముట్టారు వైకాపా సభ్యులకు - మార్షల్స్ కు మద్య తోపులాట జరిగింది.

"ప్రత్యేక హోదా విషయంలో ఏమి జరిగింది.. ఎలా జరిగింది.. ప్రకటనకు ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపింది.. ఆ ప్రతిపాధనలకు రాష్ట్రప్రభుత్వం ఏకపక్షంగా ఎలా మద్దతు తెలిపింది.. అసలు ప్రత్యేక హోదా లేదని ఉన్న ఆ పత్రాలపై చంద్రబాబు ఎలా సంతకాలు చేయగలిగారు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా స్వాగతించగలిగారు"... తదితర విషయాలపై చర్చించాలని వైకాపా పట్టుబట్టటంతో.. సభలోకి మార్షల్స్ రంగ ప్రవేశం చేశారు.

అనంతరం జరగాల్సిన అన్ని కార్యక్రమాలు జరగడంతో అసెంబ్లీ 15 నిమిషాల వాయిదా వేశారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన వైకాపా నేతలు.. టీడీపీకి నచ్చినట్లుగా సభను నడుపుతూ, సమావేశాలను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే శాసనసభను ఎన్టీఆర్ భవన్ లా నడిపిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు మండిపడుతున్నారు. మార్షల్స్ తో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ప్రత్యేక హోదాపై చర్చకు ప్రభుత్వం భయపడుతుందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఏదో రకంగా బయటకు తోసెయ్యాలనే ఆలోచనతోనే ప్రభుత్వం వ్యవహరిస్తుందని ధవజమెత్తారు. ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబడితే.. మార్షల్స్ తో గెంటివేయడం దారుణమని చెబుతున్నారు.
Tags:    

Similar News